తెలంగాణకు టిఆర్‌ఎస్ శ్రీరామరక్ష: ఎంపి
ఆదిలాబాద్,జూన్12(జనం సాక్షి): తెలంగాణకు టీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అనీ, కేసీఆర్ దిక్సూచి అని ఎంపి నగేశ్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణలోని 45 వేల చెరువులు పూర్తి మట్టిగొట్టుకుపోయాయనీ, నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా నాశనమై, చిన్ననీటి వసతులు లేకుండాపోతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చెరువుల్లో పూడిక తీసి నీటి వనరుల పెంపు కోసం మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు యత్నిస్తే, కాంగ్రెస్ పార్టీ వారు కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు నిలిపి వేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేసారనీ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతాయుతమైన పాలనను అందిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా సాగుతున్నదని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చిన్న జిల్లాలు, డివిజన్లు, మండలాలను సృష్టించి ఆయన మార్గంలో ముందుకు వెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. చిన్న జిల్లాలుగా మారిన రాష్ట్రం సుభిక్షంగా మారుతుందనీ అన్నిరంగాల్లో వృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. సింగరేణి విధ్వంసానికి కారణం టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల కోసం అనేక చర్యలు తీసుకున్నారన్నారు. మంత్రి కేటీఆర్ చేనేతను ఆదుకునేందుకు చేనేత లక్ష్మి పథకాన్ని రూపొందించారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులు, రైల్వేలైన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు.