తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల్లో బీజేపీ కూడా ఒకటి
– అధికారంలో ఉన్నప్పుడు నై… విపక్షంలో ఉన్నప్పుడు జై తెలంగాణ
ఈటెల రాజేందర్
పరకాల, జూన్ 7(జనం సాక్షి) : తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కూడా ఒకటని, అధికారంలో ఉన్నప్పుడు నై… అని, విపక్షంలో ఉన్నప్పుడు జై తెలంగాణ అంటూ ప్రజలు మోసగిస్తోందని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. పరకాల ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్,పైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో ద్వంద్వ విధానాలు పాటిస్తోందన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి, విధానం ఆ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నుంచి తెలంగాణపై ఏర్పాటు చేసే ప్రక్రియ చేపడుతున్నట్టు ప్రకటింపజేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించడం సమంజసం కాదన్నారు. 11 సంవత్సరాలుగా కేసీఆర్ తెలంగాణ కోసం ఎనలేని సేవలందిస్తూ ప్రాణ త్యాగం వరకూ పోరాడి ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో మరిచిపోలేని మహానేతగా ప్రజల మనసులో నిలిచిపోయారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన ముందు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కడ నిదురపోతున్నారని ఎద్దేవా చేశారు. పడుకున్న బీజేపీని నిద్రలేపింది టీఆర్ఎస్ పార్టీయేనని ఈటెల గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్ధులు జైల్లో ఉంటే వారిని ఏనాడు పరామర్శించని బీజేపీకి ఈరోజు తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజజ్ తెలంగాణపై ఒక్కరోజు లేవనెత్తిన మాత్రాన తెలంగాణపై ఆ పార్టీ బాగా కృషి చేస్తున్నట్టుగా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాజేందర్ విమర్శించారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ఓటర్లు సిద్ధంగా లేరన్నారు. విలేకరుల సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు ఎర్రొల్ల శ్రీనివాస్, పరకాల మండల పార్టీ అధ్యక్షుడు దగ్గు విజేందర్‌రావు, జిల్లా తెలంగాణ జేఏసీ కో-ఆర్డినేటర్ కోల జనార్దన్‌గౌడ్, కాకతీయ యూనివర్సిటీ జాక్ నాయకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.