తెలంగాణకు శాపంగా మహాకూటమి

అభివృద్దిని అడ్డుకోవడమే వారి ఎజెండా

ప్రచారంలో మండిపడ్డ ముత్తిరెడ్డి

జనగామ,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారనుందని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని అంధ్రా పెత్తందారులకు తాకట్టు పెట్టేందుకు ఈ మాయ కూటమి ఏర్పడిందన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. గతంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారు నేడు తోడు దొంగలుగా మారి ఎన్నికల్లో పోటీ చేయడం సిగ్గు చేటన్నారు. మహాకూటమికి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, ప్రాజెక్తులు అసంపూర్తిగా మిగిలిపోతాయన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ఎంతోమంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌తో కోదండరాం జతకట్టడం సిగ్గుచేటని అన్నారు. ఏ అమరవీరుని కుటుంబాన్ని అడిగి కోదండరాం తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో పొత్తుపెట్టకున్నాడో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. అధికార దాహంతో కోదండరాం తెలంగాణలో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. నీళ్లమంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టినట్లు విమర్శించారు. ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకొని పొన్నాల లక్ష్మయ్య ఏ మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించి కరువుకు శాశ్వత పరిష్కారం కోసం సీం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మిస్తే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చనిపోయిన రైతుల పేరుతో కోర్టులో కేసులు వేసిందని, ఓట్ల కోసం వప్తే నిలదీయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుతుందని, మల్లన్నసార్‌ ద్వారా వ్యవసాయానికి సాగునీరు అందించి రైతుల కష్టలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మరోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తికావడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో సుఖసంతోషాలు ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచాయని, ప్రజలు మరోసారి ఆదరించి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ కృషితో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేయడానికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.