తెలంగాణకు హరితహారం

C

– అధికంగా మొక్కలు నాటితే 5 నోట్ల నజరానా

– మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రతినిధులదే

– సిద్దపేట జిల్లా కేంద్రం అయితది

– కరీంనగర్‌ ఆంధ్రాను తలదన్నే ధాన్యాగారం అయితది

– సీఎం కేసీఆర్‌

మెదక్‌ /కరీంనగర్‌,జులై4(జనంసాక్షి):

సిద్ధిపేట నర్సరీలో మొలిచిన మొక్కను తాను అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ మొక్క వటవృక్షమై తెలంగాణకు నీడనిస్తోందని అన్నారు.  ఆనాడు మొలిచిన మొక్క ఈనాడు యావత్‌ తెలంగాణకు నీడను ఇస్తున్నదని సీఎం వ్యాఖ్యానించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. అందరికీ హరితహారం వందనాలు.. ఆకుపచ్చ దండాలు.. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కాలం ఎండ కొట్టే కాలమా? వానలు పడే కాలం. మనం దారి తప్పినం. ఎక్కడో దారితప్పడం వల్లనే ఇలా వానలు లేకుండా పోయినయి. దీనిపై ఆలోచన చేయాలన్నారు. చెట్లు నాటాలని సీఎం చెప్పాలా. ఆంధ్రోళ్ల పాలనలో ఆగమైనం. ఇక ఈ కాలంలో ఎండలు పోవాలె.. వానలు రావాలె.. కోతులు వాపస్‌ పోవాలె. చెట్లు నాటితేనే వానలు వస్తాయి. కోతులు, కోండెగలు వాపస్‌ పోవాలంటే అడవుల విస్తీర్ణం పెంచాలన్నారు. ఇక అప్పుడు ఎవర్నీ అడుక్కునే పరిస్థితి రాదన్నారు. వానలు రమ్మంటే రావాలి. కోతులు పొమ్మంటే పోవాలంటే భారగా చెట్లు పెంచాలన్నారు. గతంలో ఏ గుడికాడికో పోతే తప్ప కోతులు కనబడేవి కావు. ఊర్లకు కోతులు ఆడించెటోళ్లు వస్తె తమాషగ చూసెటోళ్లం! కానీ ఇప్పుడు మందలకు మందలు కోతులు వచ్చి ఊర్ల విూద పడుతున్నయి. అవి ఉండె జాగను చెడగొడుతున్నం కాబట్టి అవి మన ఊర్ల విూదకొచ్చి పడుతున్నయి. చిన్నపుడు రోహిణీ కార్తె వచ్చిందంటే.. బ్రహ్మాండంగ నాగళ్లు కట్టి, విత్తనాలు వేసేది! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికిపోయినవి వానలు? చెట్లను నరకడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని సిఎం కెసిఆర్‌ అన్నారు.  హరితహారం ఒక్కరితో విజయవంతం కాదు.. ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందన్నారు.’గ్రామాల్లో యువత పెద్ద ఎత్తున చెట్లు పెంచేందుకు ముందుకు రావాలన్నారు. సర్పంచ్‌లు ముందుండి దీనిని నడిపించాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని బాగా నడిపించిన నియోజకవర్గానికి ఐదుకోట్ల నజరానా ఇస్తామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. సిద్దిపేట ఈ అవకాశాని తీసుకుని హరితహారంలో ముందుండాలన్నారు. అందుకే సంవత్సరానికి 40కోట్ల మొక్కలు.. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 40లక్షల మొక్కలు తయారు చేసి, గవర్నమెంటు సిద్ధంగ ఉంచిందన్నారు.  ప్రతి వర్షాకాలంల, ప్రతి గ్రామంల 40వేల మొక్కలు నాటితే.. నాలుగేండ్లకు 1.60 లక్షల మొక్కలయితయి. ఎక్కడ ఖాళీ జాగ కనబడితె అక్కడ చెట్లు పెట్టాలె. మనం పట్టుబట్టి ఒక్క ఊర్ల 1.60 లక్షల చెట్లు ఉంటె.. మన ఊరుకు వచ్చిన వాన మబ్బు కురవకుండ పోనేపోదన్నారు.  నన్ను ఇంతటి వాడిని చేసిన సిద్దిపేట మొక్కల పెంపకంలో కూడా ఆదర్శంగా నిలవాలన్నారు.

గోదావరి నీళ్లతో సిద్ధిపేట ప్రజల పాదాలను కడుగుతా

రానున్న మూడున్నర ఏళ్లలో గోదావరి నీళ్లతో సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల పాదాలను కడుగుతానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సిద్ధిపేటకు మూడు కావాలి. అవి.. సిద్ధిపేటను జిల్లా చేయడం, సాగు నీరందించడం, రైలు తేవడం. ఈ మూడు కల్పిస్తే సిద్ధిపేట అద్భుతంగా ముందుకు పోతుందున్నారు.

సిద్ధిపేటలో ప్రతీ గ్రామానికి సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం నుంచి సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తరలిస్తాం. ఇందుకు త్వరలోనే అక్కడ తాను శంకుస్థాపన చేయబోతున్నాని అన్నారు. త్వరలోనే కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానన్నారు. అందుకు ఇక్కడ ప్రజలంతా బస్సుల్లో తరలి రావాల్సి ఉంటుందన్నారు. తనభార్య మొక్కుకున్న మేరకు  కుటుంబ పైసలతో కాళేశ్వరస్వామికి బంగారు కిరీటం చేపిస్తామన్నారు.  సిద్ధిపేట ప్రజలకు నీరందివ్వు అని మొక్కుతా. ఐదు నియోజకవర్గాలను నీరందేలా కృషి చేస్తానని ప్రజల హర్షధ్వారాల మద్య అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక్కడ కట్టే ప్రాజెక్టులతో 5 నియోజకవర్గాల్లో పంటలకు నీరందతుందన్నారు. గోదావరి నీటితో మా ఆడబిడ్డల పాదాలు కడుగుతా… పొలాలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లాలోని ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు రప్పిస్తామని ప్రకటించారు. ఇక్కడే కాక బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాలకు కూడా గోదావరి నీళ్లు అందిస్తామని అన్నారు.

జిల్లా కేంద్రాలుగా సిద్దిపేట, మెదక్‌

సిద్దిపేటకు రైల్వే ప్రాజెక్టు మంజూరైంది… ఆ పనులు కూడా మొదలయ్యాయని అన్నారు. సిద్దిపేట వందశాతం జిల్లా కేంద్రం అవుతుందని, సిద్దిపేట, మెదక్‌ రెండూ జిల్లా కేంద్రాలు కావాల్సిన అవసరముందన్నారు. సిద్దిపేటకు విమానాశ్రయం రాదు.. శావిూర్‌పేటకు వచ్చే అవకాశం ఉందన్నారు.  ఈ సందర్భంగా సిద్దిపేటలోని పాతబస్టాండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్ష స్ఫూర్తి పైలాన్‌, హరితహారం జెండాను సీఎం ఆవిష్కరించి మొక్కలు నాటారు. తెలంగాణ కోసం 1531 రోజులు దీక్ష చేసిన స్థలం దగ్గర పైలాన్‌ను నిర్మించారు. తెలంగాణ దీక్షా పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు. అంతకుముందు హరితహారంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయం, బస్‌ డిపోలో సీఎం మొక్కలు నాటారు.తెలంగాణలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో విజయవంతం చేస్తాం

తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేటలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హరీష్‌ మాట్లాడారు. హరితహారమనేది మనకు కొత్తదేవిూ కాదన్నారు. 1996లోనే కేసీఆర్‌ సిద్ధిపేటలో వేలాది మొక్కలు నాటారని గుర్తు చేశారు. ఆనాడే మొక్కలు నాటి సిద్ధిపేటను సీఎం పచ్చగా చేశారన్నారు. సిద్ధిపేటకు తాగు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని తెలిపారు. మెదక్‌ జిల్లాలో మూడున్నర కోట్ల మొక్కలు పెంచుతామని చెప్పారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక రోజు వేతనాన్ని హరితహారానికి విరాళంగా ఇచ్చారని ప్రకటించారు.హరితహారానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులే కథానాయకులు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ లో జరిగిన హరితహారం సభలో ఆయన మాట్లాడారు. నాలుగు చెట్లు పెట్టి మంచిగా సాదుకోవడమే హరితహారం అన్నారు. హరితహారంలో గ్రామ సర్పంచులు ముఖ్యపాత్ర పోషించాలని, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కోరారు. ఒక్కో గ్రామానికి 40వేల మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, వాటిని బతికించే బాధ్యత సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీఆర్వోలు, గ్రామప్రజలదేనన్నారు. 40 వేల మొక్కల్లో ఒక్క మొక్క బతక్కపోయినా సర్పంచ్‌, ఎంపీటీసీ రాజీనామా చేయాలన్నారు.మూడేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని చెప్పినమని, ఆ మాటను నిజం చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హుస్నాబాద్‌ లోని గ్రామగ్రామానికి గోదావరి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. అందరం పట్టుబట్టి గ్రామాలను పట్టుగొమ్మల్లా తయారు చేయాలని చెప్పారు. సర్పంచులు గ్రామ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకుపోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందరం పట్టుబట్టి హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనం ఇన్నాళ్లు ఆంధ్రోళ్ల చేతుల్లో చిక్కిపోయి ఆగమాగం అయినమని సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షాకాలంలో ఎండలు కొట్టడం ఎప్పుడైనా చూసినమా అని ప్రశ్నించారు. మొత్తం కరువొచ్చి మనవిూద పడ్డది.. కోతులొచ్చి మందివిూద పడ్డయన్నారు. అప్పట్లో ముసురు పడితే వారం రోజులుండేదని, ఇప్పుడు వాన ఇక్కడపడితే అక్కడ పడట్లేదు.. అక్కడ పడితే ఇక్కడ పడట్లేదన్నారు. ఒక్క ఊర్లోనే ఒక పక్క పడితే ఇంకోపక్క పడట్లేదని గుర్తుచేశారు.ఇదేదో ప్రభుత్వం చేసే కార్యక్రమమని చేతులు దులుపుకోవద్దని, తాను కూడా ఒక మొక్క నాటి చేతులూపి పోయేటోన్ని కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సర్పంచులు వాడవాడల విూటింగ్‌ పెట్టి హరితహారంపై అవగాహన కల్పించాలని చెప్పారు. హుస్నాబాద్‌ బాగా వెనుకబడ్డ ప్రాంతమని, ఇక్కడి ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. 2004లో పర్యటనకు వచ్చినప్పుడు ప్రజల సమస్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విూ పొలాలకు నీళ్లు, విూ ఇండ్లకు మంచినీళ్లు, కోతల్లేకుండా కరెంట్‌ ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని, మొక్కలు నాటి పల్లెలను పచ్చని వనాలుగా మార్చే బాధ్యత విూరు తీసుకోవాలని చెప్పారు. అందరూ బాధ్యతగా పనిచేస్తే బంగారు తెలంగాణ సాకారమైతదన్నారు.హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హుస్నాబాద్‌ నగర పంచాయతీకి కోటి రూపాయలు విడుదల చేస్తామన్నారు. మొత్తం రూ.13.10 కోట్లు నిధులిస్తామని చెప్పారు. మహాసముద్రం గండికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ఇక సొంత కరెంట్‌ అందుబాటులో ఉంటదని ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు బాయిలర్‌ ఒకటి ఇవాళే ప్రారంభించారు. రెండోది కూడా పూర్తవుతోంది. త్వరలోనే 1200 మెగావాట్ల సొంత కరెంట్‌ అందుబాటులోకి రానుందన్నారు. 2 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా మనకు వస్తున్నదని, వచ్చే మార్చి నుంచి రైతులకు పగటి పూటే 9 గంటల కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ వివరించారు.పేదల కోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ అడక్కుండానే కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పథకం సృష్టికర్త మంత్రి ఈటెలేనని చెప్పారు. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని, కరీంనగర్‌ జిల్లా ధాన్యాగారంగా తయారు కాబోతోందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. విూకు ఎన్ని డబ్బులు కావాలన్న ఇస్తం.. విూ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు.