తెలంగాణను అడ్డుకుంటున్న
కావూరి ఇంటిని ముట్టడించిన టీ అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఎంపీ కావూరి సాంబశివరావుపై కన్నెర్ర చేసింది. సోమవారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యే సూచనలు వచ్చినా, కావూరి అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణవాదుల మనోభావాలను గాయపరుస్తున్నాడని, ఈ విషయాలపై కావూరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఎంపీ ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయవాదులు ఇంటి ముట్టడికి వెళ్లగా, అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయవాదులను నిలువరించేందుకు నానా అవస్థలు పడ్డారు. అయినా, న్యాయవాదులు ఏమాత్రం తగ్గకుండా బంజారాహిల్స్ లోని కావూరి ఇంటికి చేరుకున్నారు. బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో ఆగ్రహం పట్టలేక న్యాయవాదులు ఎప్పుడు శాంతియుతంగా ఉద్యమించినా, పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంతే కాకుండా, కావూరి ఇంటి అవరణలో ఉన్న పూల కుండీలను విరగ్గొట్టారు. ఇంటిపైకి రాళ్లను విసిరి తమ నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు న్యాయవాదులను పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తరలించి, కేసులు పెట్టారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. అక్కడ కూడా చాలా సేపు న్యాయవాదులు నినాదాలు చేస్తూ, తమ నిరసనను కొనసాగించారు.