తెలంగాణను నేనే అభివృద్ధి చేశా..ఏపీ సీఎం చంద్రబాబు

1

వరంగల్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తనేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నరు. వరంగల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన రెండు ప్రాంతాలకు న్యాయం చేస్తానని ప్రకటించారు. గతంలో పాలకుర్తి సమావేశానికి వస్తే అడ్డుకున్నారని… నేడు వరంగల్‌ జిల్లా సభకు వస్తుంటే ప్రజలు నీరాజనాలు పట్టారని చెప్పారు. తెలంగాణలో పేదరికం పోయినప్పుడే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నరు. ఎంతో మంది నాయకులు పార్టీని వీడి వెళ్లారు తప్ప.. కార్యకర్తలు కాదన్నరు. తెలంగాణకు మిగులు బడ్జెట్‌ వచ్చిందంటే ఆనాడు నేను చూపిన దూరదృష్టి వల్లేనన్నారు. నక్సలైట్లకు ఎదురొడ్డి పార్టీ పటిష్ఠానికి కార్యకర్తలు పనిచేశారని పేర్కొన్నారు. ‘అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. ప్రతిపక్షంలో ఉన్నా పోరాడాం అన్నారు. విభజన తర్వాత సైతం తెలంగాణలో ఆదాయం వస్తోందంటే ఆనందించానని బాబు అన్నరు. వరంగల్‌ జిల్లా కాకతీయుల ఖిల్లా అని, సభ ప్రారంభమై ఇంత సేపు గడిచినా ఒక్కరూ కూడా కదల్లేదని ఈ ఘటన తన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. సమక్క సారక్క జాతరకు గుర్తింపు తీసుకువచ్చిందని తెదేపానేని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ, కాళోజీ, ఆచార్య జయశంకర్‌ తదితర మహనీయుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని, వారికి తాను అండగా నిలబడతానని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా నిచ్చారు. హైదరాబాద్‌ నుంచి వరంఘల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించిన బాబు భువనగిరి, ఆలేరు, జనగాం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.