తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ

..న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి):
ఈనెల 28న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో దేశరాజధాని వేడెక్కింది. తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి రావాలని కేంద్రం నుంచి పిలుపునందడంతో దీనిలో పాల్గొనడానికై రాష్ట్రం నుంచి రాజకీయ పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎవరిని పంపాలన్న విషయం సాయంత్రం వరకు ఖరారు కాలేదు. అయితే మూడు ప్రాంతాల నుంచి ఆరుగురు నేతలు – చిన్నారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లురవి, ఉండవల్లి, చెంగలరాయుడు, గాదె వెంకట్‌రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. వారితో చర్చించిన అనంతరం ఆజాద్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అఖిలపక్ష సమావేశానికి
పార్టీ తరఫున హాజరయ్యే అభ్యర్థుల పేర్లను ఖరారుచేస్తారు. ఆజాద్‌తో సమావేశం సందర్భంగా ఈ ఆరుగురు నేతలు మాట్లాడుతూ తమలో అఖిలపక్ష సమావేశానికి ఎవరిని పంపినా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కాగా గురువారంఉదయం నుంచి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు హడావుడిగా గడిపారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో ఈ ఉదయం ఎంపీలంతా సమావేశమై అఖిలపక్ష భేటీ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. మధ్యాహ్నం ఎంపీ వివేక్‌ నివాసంలో టి-ఎంపీలు మందజగనాదం, మధుయాష్కీ, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌ తదితరులు సమావేశమై మళ్లీ తాజా పరిణామంపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణపై అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలని తమ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పామని ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. కాంగ్రెస్‌ అభిప్రాయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. టిడిపి తెలంగాణపై కప్పదాటు వైఖరి అవలంభిస్తోందని మందా విమర్శించారు. ఆ పార్టీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణపై మనం కూడా స్పష్టమైన వైఖరి చెప్పాలని సోనియాను కోరామని మందా వివరించారు.
కొన్ని పార్టీలు తెలివిగా అఖిలపక్షంలో తెలంగాణపై తమ వైఖరిని తెలిపేందుకు తప్పించుకునేలా చూస్తున్నాయని మందా దుయ్యబట్టారు. కాంగ్రెస అభిప్రాయం చెబితేనే తాము చెపుతామని పార్టీలు అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టిడిపి, వైయస్సార్‌ సీపీ వంటి కొన్ని పార్టీలు అఖిలపక్షంలో చెబుతామని ప్రకటిస్తూ ఇప్పుడు వెనక్కి మళ్ళే వైఖరి అవలంభిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనని ఆయన అన్నారు. మరో ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆయా పార్టీల సీమాంధ్రనేతలు తెలంగాణలో తిరగలేరని హెచ్చరించారు. కాంగ్రెస్‌ తెలంగాణపై అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ఇక ఈ ప్రాంత ప్రజలు సహించబోరన్నారు. అఖిలపక్షంలో కాంగ్రెస్‌ వైఖరి వెల్లడించకపోతే ఈ ప్రాంతలో పార్టీ ఉనికి కోల్పోక తప్పదని అన్నారు. ఇదే అఖరి అఖిలపక్షం కావాలని కోరుకుంటున్నామన్నారు. 2008లోనే టిడిపి తెలంగాణకు అనుకూలమంటూ తేల్చి చెప్పిందన్నారు. ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనే ఏకవాక్యంతో లేఖ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. మిగిలిన ఎంపీలు కూడా మాట్లాడుతూ అఖిలపక్షంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఢిల్లీకి చేరుకున్న పార్టీల ప్రతినిధులు
ఇదిలా ఉండగా శుక్రవారం జరిగే అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల నేతలు నేటి సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. బిజెపి నేతలు హరిబాబు, కిషన్‌రెడ్డి,యండల లక్ష్మీనారాయణ, ఢిల్లీకి చేరుకున్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, నాయిని నర్సింహారెడ్డి జేఏసీ నేతలు, కోదండరాం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. అటువైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీమాంధ్ర నుంచి మైసూరారెడ్డి, తెలంగాణ నుంచి కెకె మహేందర్‌రెడ్డి కూడా అఖిలపక్షానికి హాజరు అవుతున్నారు. అలాగే టిడిపి నుంచి అఖిలపక్షానికి సీమాంధ్ర నుంచి యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుంచి కడియం శ్రీహరి, ఈ సాయంత్రం ఢిల్లీకి బయలు దేరారు. గురువారం ఉదయం కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్నచంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పాల్గొంటున్నారు. సిపిఐ తరఫున కె. నారాయణ, మల్లేష్‌, సిపిఎం తరఫున బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాగా తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. అఖిలపక్షం సమావేశానికి ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి కిరణ్‌కు ఫోన్‌ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద శుక్రవారంనాడు అఖిలపక్ష సమావేశం అనంతరం రాజకీయ పరిణామాలలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. ఓ వైపు అఖిలపక్ష సమావేశం జరగనుండగా మరోవైపు తెలంగాణ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణపై ముమ్మర కసరత్తు చేస్తోంది.