తెలంగాణపై ఢిల్లీ తలమునక

సోనియా, షిండే , అహ్మద్‌పటేల్‌ , ఆజాద్‌, రాహుల్‌, రాష్ట్రపతి, రోశయ్య,కిరణ్‌లతో చర్చలు
అఖిలపక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా !
2009 ప్రకటనకు ముందు పరిస్థితులపై రోశయ్యతో ఆరా
త్వరగా నిర్ణయం తీసుకోవాలని యోచన
మీరేనిర్ణయం తీసుకున్నా మంచిదే : కిరణ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ అంశాన్ని తేల్చేయనే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధిష్టానం పెద్దలు ఇదే అంశంపై తలమునకలయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్యతో సంప్రదింపులు జరిపారు. 2009 డిసెంబర్‌ 9కి ముందు నాటి పరిస్థితులను అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న రోశయ్య రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటి అయ్యారు. వారి చర్చల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై హోం మంత్రిత్వ శాఖ ప్రకటన, తర్వాతి పరిణామాలపై చర్చించారు. ఆదివారమే ఢిల్లీకి రావాలంటూ సీఎం కిరణ్‌ను ఆదేశించిన పార్టీ అధిష్టానంతో ఆయనతో సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ గంటకు పైగా కిరణ్‌తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణ ప్రకటన చేస్తే ఎదురుకాబోయే పరిస్థితులు, అఖిలపక్షంలో వివిధ పార్టీల స్పందన, ఆయా పార్టీల బలాబలలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో సహకార ఎన్నికల్లో సాధించిన ఘన విజయం, త్వరలో నిర్వహించబోయే సాగునీటి పారుదల సహకార సంఘాల ఎన్నికల్లో చేపట్టబోయే వ్యూహాలపై వివరించారు. ఆమె వాటిని తేలికగా తీసుకొని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, స్థానికంగా పొత్తులు ఇతర అవకాశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ స్పందిస్తూ తెలంగాణపై మీరేనిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనంటూ చెప్పాడు. తర్వాత కిరణ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోనూ భేటి అయ్యారు. సోనియాతో భేటీకి ముందూ, తర్వాత కిరణ్‌ పలువురు పార్టీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలు, ప్రత్యామ్నాయాలపై వారు కిరణ్‌ను వివరాలు అడిగారు. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. హోం మంత్రి
సుశీల్‌కుమార్‌ షిండే అఖిలపక్షంలో గడువు తర్వాత పరిస్థితులు, హైదరాబాద్‌లో టీ జేఏసీ, ప్రత్యేక రాష్ట్రం కోరుకునే వారు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఇతర అంశాలపై మాట్లాడారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 2014 ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, అత్యధిక ఎంపీ స్థానాలు గెలుపొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలంటూ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే, జాప్యం చేస్తే తలెత్తబోయే పరిణామాలపై ఆయన ఆరా తీసినట్లుగా సమచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌, సీనియర్‌ నేత మోతిలాల్‌ వోరాతోనూ కిరణ్‌ భేటీ అయ్యారు. వీరి చర్చల సారాంశం మొత్తం తెలంగాణ చుట్టూనే తిరిగింది. పార్టీ పెద్దలంతా తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం చూపితే మంచిదనే యోచనలో ఉన్నట్లు సమాచారం. నెల రోజుల్లోగా సమస్యను తేల్చేస్తామంటూ ప్రకటించిన షిండే తర్వాత సంప్రదింపులకు మరికొంత సమయం కావాలని కోరడంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. తమ రాజీనామాలు ఆమోదించకుంటే త్వరలో జరుగబోయే బడ్జెట్‌ సమావేశాలను అడ్డుకుంటామని వారు ఇదివరకే ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీ జేఏసీ నిర్ణయించింది. తమ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఏ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు చోటు లేదని ముఖంమీదే తేల్చిచెప్పింది. అసెంబ్లీ ముట్టడి, రహదారుల దిగ్బంధానికి ఇప్పటికే పిలుపునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం వైఖరిలో మార్పురాకుంటే వంద రోజుల సకల జనుల సమ్మె చేపట్టనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం సమస్యను మరింత కాలం నానబెట్టవద్దనుకుంటోంది. యూపీఏలోని భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ, ఆర్‌ఎల్డీతో పాటు బయటినుంచి మద్దతిస్తున్న బీఎస్పీ ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా వైఖరి ప్రకటించింది. యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణబ్‌ కమిటీకి పలు పార్టీలు తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు సమర్పించాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని, ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణపై స్పష్టత ఇచ్చేందుకే కాంగ్రెస్‌ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముందుగానే ప్రకటించినట్లుగా ఈనెల 20న చేపట్టబోయే సంప్రదింపుల ప్రక్రియపై కూడా పెద్దలు కిరణ్‌తో మాట్లాడినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పీసీసీ చీఫ్‌ బొత్సా సత్యనారాయణను కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం.