తెలంగాణపై నిర్ణయం తీసుకొమ్మని కేంద్రాన్ని కోరాను

సహకార స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాం
ముఖ్యమంత్రి కిరణ్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి):
తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధినేత్రి సోనియాగాంధీని కోరామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో సమా వేశమయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తెలంగాణ అంశంపై మేడంతో చర్చించామన్నారు. రాష్ట్రం నుంచి కావాల్సిన పూర్తి సమాచారం అధిష్టా నానికి అందించామని పేర్కొన్నారు. తెలంగాణపై తనపై మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్త కథనాలని తోసిపుచ్చారు. రైతుల సంక్షేమ కార్యక్రమాలే సహకార ఎన్నికల్లో తమను గెలిపించాయన్నారు. 60 శాతం వరకు సొసైటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుందని చెప్పారు. వడ్డీమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు, మద్దతు ధరల పెంపు తదితర అంశాల కారణంగా రైతులు కాంగ్రెస్‌ వెన్నంటి నిలిచారన్నారు. చంద్రబాబు హయాంలో ధాన్యానికి ఐదేళ్లలో కేవలం 70 రూపాయలు మాత్రమే మద్దతు ధరను పెంచారని పరోక్షంగా అన్నారు. రైతులకు 7శాతం వడ్డీకే పంట రుణాలు ఇస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే వినియోగదారులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. వచ్చే ఉగాది నుంచి బియ్యంతో పాటు అదనంగా 9 నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ ఏడాది రైతులకు ఉచిత విద్యుత్తు కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. వీలైనంత త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సహకార ఎన్నికల స్ఫూర్తితో ముందుకు సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేవంలో డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, వట్టి వసంత కుమార్‌, రఘువీరారెడ్డి, ముఖేశ్‌, పొన్నాల, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.