తెలంగాణపై మరింత ఒత్తిడి
భాజపా రాజకీయాలు మాని లోక్‌సభలో మాతో
గొంతుకలపాలి : ఎంపీ పొన్నం
కరీంనగర్, మార్చి 27 (జనంసాక్షి) : ఏప్రిల్ 22 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణపై కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతామని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాని తెలంగాణ విషయంలో కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల సంఖ్య తక్కువగా ఉందని, 150 మంది ఎంపీలున్నా భాజపా తమకు మద్దతు పలికితే కేంద్రం దిగివస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్తున్న బీజేపీ నాయకులు, పార్లమెంట్‌లో తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేయమని ఎందుకు కోరారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆందోళన చేస్తున్న ఎంపీలు సభ వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారని, ప్రశ్నోత్తరాల సమయం వృథా అవుతుంది కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని అద్వాని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మర్చిపోయి బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఆ పార్టీ తెలంగాణ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సంకీర్ణ రాజకీయాల పేరు చెప్పి మళ్లీ తెలంగాణకు ద్రోహం చేయడం ఖాయమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన టీడీపీ ఇప్పుడు విద్యుత్ కోతలపై ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కన్న కృష్ణ, గుగ్గిళ్ల జయశ్రీ, మొహసిన్, రహమత్, శ్రీనివాస్, అహ్మద్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.