తెలంగాణపై సీమాంధ్ర పార్టీల దొంగాట


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో తీర్మానం చేశామని, కేంద్రానికి లేఖ ఇచ్చామని చెప్తూ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్తూ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇచ్చేశక్తి గాని, ఆపే శక్తి గాని లేదు.. కేంద్రం ఇస్తామంటే వద్దనబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రోటికాడి పాట ఆ రోడికాడ పాడుతూ పబ్బం గడుపుతున్నాయి. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేయడానికి అన్ని పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఒక దశలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టకుంటే తామే పెడతామంటూ అసెంబ్లీ నిండు సభలో ప్రకటించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండేది. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కాగా, కాంగ్రెస్‌ నుంచి వేరుబడి వైఎస్సార్‌ సీపీ ఏర్పడింది. ఇప్పటి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్నాడు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరేది చెప్పలేదు. తెలంగాణ అనుకూలమనిగానీ, వ్యతిరేకమని గానీ చెప్పే ప్రయత్నం చేయకుండా ఎప్పటికప్పుడూ సమస్యను దాటవేస్తోంది వైఎస్సార్‌ సీపీ. అధికార కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై ఎన్ని అఖిలపక్ష సమావేశాలు పెట్టినా తన వైఖరి మాత్రం చెప్పలేదు. 2012 డిసెంబర్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో మీడియాతో మాట్లాడుతూ తాము అఖిలపక్షం నిర్వహించామంటే అదే తెలంగాణకు అనుకూలమన్నాడే తప్ప తర్వాతికాలంలో ఆమాట మీద నిలబడలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధుల్లో ఒకరైన రేణుకాచౌదరి తెలంగాణ ఏర్పాటుపై అడ్డంగా మాట్లాడిన సందర్భాలెన్నో. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అసలు వైఖరేంటో తేటతెల్లం కాదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు మాత్రం పదవులను పట్టుకు వేలాడుతూ అమ్మ తెలంగాణ ఇస్తుందంటూ సోనియా జపం చేస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒకటంటే సీమాంధ్ర నేతలు మారోటంటారు. ఇలా సమస్యకు ముగింపు పలికే ప్రయత్నమేది కాంగ్రెస్‌ చేసిన పాపాన పోలేదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ తర్వాత అలాంటి వైఖరే అవలంబిస్తున్న పార్టీ తెలుగుదేశం. మహానాడులో తీర్మానం చేశామన్నా, ప్రణబ్‌ కమిటీకి, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ ఇచ్చినట్టు చెప్పుకున్నా 2009లో కేంద్రం ప్రకటన చేసిన తర్వాత అడ్డంగా తిరిగింది చంద్రబాబే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలెవరూ మర్చిపోవడం లేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. తీర్మానం చేశామని, లేఖలు ఇచ్చామని చెప్తున్న టీడీపీ అసెంబ్లీ తెలంగాణపై తీర్మానం చేయమని ఒక్కరోజూ కోరలేదు. తీర్మానం వరకూ వస్తే ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తారో, వారిపై అధినేతకు ఎంతమేరకు అజామాయిషీ ఉందో స్పష్టమవుతుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బాబు మాట వినే పరిస్థితి లేకపోవడం వల్లనే టీడీపీ తీర్మానం మాటెత్తడం లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారం ఇస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పే బీజేపీ, తెలంగాణ ఇవ్వాలని తీర్మానించిన సీపీఐ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్‌, తెలంగాణ కోసం తీర్మానం చేశామని చెప్పుకునే టీడీపీ వారితో గొంతు కలపడం లేదు. శాసనసభ నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలను వెళ్లగొట్టినా కనీసం ప్రశ్నించడం లేదు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై హామీలిచ్చి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు తీర్మానం చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో సీపీఎం మినహా మిగతా పార్టీలేవి తెలంగాణకు వ్యతిరేకమని చెప్పలేదు. ఎంఐఎం వైఖరి ఏమిటో స్పష్టం చేయలేదు. ఆ రెండు పార్టీలకున్న బలం కూడా అతి స్వల్పం. ఈ నేపథ్యంలో తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే అధికార కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, సీపీఐ సభ్యుల భలంతో తీర్మానం సునాయాసంగా విజయం సాధిస్తుంది. కానీ ఆ ప్రయత్నమేది అధికార పక్షం చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్షం కోరడం లేదు. అంటే తెలంగాణపై సీమాంధ్ర పార్టీలు ఆడుతున్నది దొంగాటేనని స్పష్టమవుతోంది.