తెలంగాణలో ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి..
..కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం ,(జనం సాక్షి ):- ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ రావు స్పందించారు. ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేసి చర్యలకు ఆదేశించినట్టు చెప్పారు.తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారన్నారు. ఈనెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించామని అనుభవం ఉన్న సర్జన్‌తోనే 34 మందికి ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మృతిచెందిన నలుగురికి పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు.
30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించామని, మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించినట్లు డీహెచ్ తెలిపారు.మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా అండగా ఉంటామని డీహెచ్ భరోసా ఇచ్చారు. మృతుల కటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా,డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.