తెలంగాణలో ఉద్యోగాల జాతర

6

ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున ఉపాధి

మంత్రి జూపల్లి

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రయివేటు కొలువుల జాతర జరగనుందని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాల్లో 5,280 యూనిట్లలో రూ. 5,289 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సవిూక్ష నిర్వహించారు. సవిూక్ష ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు కాబోయే పరిశ్రమలలో 46,230 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 3,067 మైక్రో, 149 స్మాల్‌ పరిశ్రమల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు వస్తాయని చెప్పారు. భారీ పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమల అనుమతుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామన్నారు. మూత పడిన పరిశ్రమల గురించి ప్రభుత్వం డేటా సేకరిస్తుందని తెలిపారు. ఆ పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. సబ్సిడీల కోసం విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల అనుమతుల్లో జాప్యంపై టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతీ మండల కేంద్రంలో రిటైర్డ్‌ ఎమ్మార్వోలతో పాటు ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌ను నియమిస్తామని ప్రకటించారు.