తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర కీలకం
అల్లం నారాయణ
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ‘పదేళ్ల పోరాట మహాసభ’కు సంబంధించన పోస్టర్‌ను ఆయన ఆదివారం గన్‌పార్క్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ పదేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ఉద్యమం చీలికలుగా ఉన్న సందర్భాల్లో వారి మధ్య పొడసూపిన అభిప్రాయభేదాలను తొలగించడమే కాకుండా వారిని ఒకే వేదికపై తెచ్చి ఉమ్మడి పోరుకు కార్యోణ్ముఖులను చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టుల ఫోరానికే దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010లో ఐదువేలమంది జర్నలిస్టులతో హైదరాబాద్‌లో మహా ర్యాలీనిర్వహించామని, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకుని నిరసన తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, నాయకులు పల్లె రవికుమార్, క్రాంతికుమార్, హజారే, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.