తెలంగాణలో మృత్యు తాండవానికి మీరే కారణం


హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలకు ప్రభుత్వ వైఖరే కారణమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం విమర్శించారు. ఆదివారం నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితు లకు న్యాయం చేయాలని నిర్వహించిన ఒక రోజు నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌ సందర్భంగా కేవలం రెండు
వాహనాలు కాలిపోతేనే తెలంగాణవాదులపై 36 కేసులు పెట్టిన ప్రభుత్వం, తెలంగాణలో వెయ్యి మంది యువకుల మరణాలకు పరోక్షంగా కారణమైందని, అటువంటప్పుడు ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలని కోదండరాం నిలదీశారు. నల్గొండ జిల్లాలో రక్షిత మంచినీరు అందించక పోవడం వల్ల వేల సంఖ్యలో అమాయక తెలంగాణ ప్రజలు ఫ్లోరోసిస్‌ వ్యాధితో జీవచ్ఛవాలుగా మిగిలారని, ప్రభుత్వం చేసిన ఈ తప్పిదానికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అందరు భాగస్వాములవుతున్న తరుణంలో అనవసరంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఆజాద్‌ ‘న గులాం న ఆజాద్‌’లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తో మాకు విభేదాలు ఉన్నాయని సీమాంధ్ర పత్రికలు కథనాలు రాస్తున్నాయని, అవన్నీ అబద్ధాలేనని కోదండరాం స్పష్టం చేశారు. ఉద్యమ పోరాటంలో తామూ ఏనాడు విడిపోలేదన్నారు. బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో ఏకాభిప్రాయం కావాలని మూడేళ్లుగా చెబుతున్నా ఇంతవరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్పిన తరువాతే తెలంగాణ సమస్య పరిష్కరిస్తామని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఆజాద్‌ పొంతనలేని సమాధానాలు చెబుతూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని దీక్షల రూపంలో యువకులు ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళుతున్నారని తెలిపారు. పది జిల్లాల్లో ఏదో ఒక చోట కనీసం 50 మంది యువకులు తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణవాదం తగ్గిందని అనవసర ప్రేలాపణలు చేసేవారికి దీటైన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు.