తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి

మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాను రద్దు చేయాలని టిజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా శనివారంనాడు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక దోపిడికి వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా ఈ నెల 22న సంపాదకులు, పత్రిక,మీడియా యాజమాన్యాల తో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌.డి.సి.ఎం.డి చంద్రవదన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటిని బహ్కిరిస్తున్నామని కమిటీలోని సభ్యులు అల్లం నారాయణ, డైరెక్టర్‌ ఎన్‌ శంకర్‌ తెలిపారు. ఈ కమిటీలో వీరితో పాటు ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్‌, దిల్‌రాజు, విజయేందర్‌రెడ్డి, తదితరులు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. కమిటీ వేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణిస్తూ కమిటీని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేవలం కమిటీ వేసి అందులో కొన్ని సీన్లు తొలగించినంత మాత్రాన తెలంగాణకు జరిగిన అవమానం మాసిపోదని, సినిమాను నిషేధించాలని తెలంగాణ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేత శ్రావణ్‌ మాట్లాడుతూ …. సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని, తెలంగాణ వ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. సినిమా మొత్తం పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా… దర్శకుడు పూరి జగన్నాథ్‌ సినిమాలోని 12 అభ్యంతర కర సీన్లను తొలగించినట్లు ప్రకటించారు. సినిమా ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో తీయలేదని స్పష్టం చేశారు. కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగులు, సన్నివేశాలు… కెసిఆర్‌ను, టీఆర్‌ఎస్‌ పార్టీని, ఉద్యమ తీరును కించపరిచే విధంగా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పలుచోట్ల ఈ చిత్రం రీళ్ళను దగ్ధం చేయడంతో పాటు ప్లెక్సీలు, కటౌట్లు,పోస్టులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.