తెలంగాణిస్తే కాంగ్రెస్‌కు బలం

తెలంగాణ భారం రాష్ట్ర నాయకత్వానిదే

విభజన, సమైక్యకు విడివిడిగా ముసాయిదా

బరువు, బాధ్యతలు బొత్స, కిరణ్‌, రాజనర్సింహకు

రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి

బెంగళూర్‌లో దిగ్విజయ్‌ ప్రకటన

బెంగళూరు/హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) :

తెలంగాణ భారం రాష్ట్ర నాయకత్వం చేతిలోనే పెట్టామని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. రాష్ట్రంలో పర్యటన ముగించుకొని మంగళవారం ఆయన బెంగళూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన పరోక్షంగా మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సమైక్యాంధ్ర కొనసాగింపు వల్ల తలెత్తే పరిణామాలపై ముసాయిదా రూపొందించి సమర్పించాల్సిందిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అప్పగించామన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆశలన్నీ దక్షిణాదిపైనేనని తెలిపారు. దక్షిణాదిలో 50 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ యూపీఏ సర్కారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరుగుతుందన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది. దీనిపై హైకమాండ్‌ కూడా తీవ్రంగా చర్చిస్తోంది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీకి విజయావకాశాలు ఎక్కువవుతాయని’ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో తమకు బలం పెరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దృష్టి అంతా దక్షిణాదిపైనే ఉందన్నారు. 2014 ఎన్నికల్లో దక్షిణాదిపైనే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుందని, దక్షిణాదిలో 50 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ విజయబావుటా ఎగురవేస్తామన్నారు. తమిళనాడులో పరిస్థితి సానుకూలంగానే ఉందన్నారు. అయితే, అక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తులకు ఇంకా సమయం ఉందని తెలిపారు. కేరళలోనూ తమకే అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌ తమకు కీలకమైన రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ సహా పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తమ బలం పెరుగుతుందని తెలిపారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం కచ్చితంగా ఉండబోతోందని, ఇరు ప్రాంతాల వారు తప్పకుండా ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణా విభజన కష్టం అంటూనే రాష్ట్రం ఏర్పాటు తప్పదేమోనంటూ కూడా పలు సందర్భాల్లో దిగ్విజయ్‌ సింగ్‌ నర్మగర్భంగా రాబోయే పరిణామాలకు అందరిని సమాయత్తం చేయకనే చేశారు. మరో వారం పదిరోజుల్లో కచ్చితమైన నిర్ణయం వస్తుందని తేల్చిమరీ వెల్లిపోయారు. నాయకులంతా సమన్వయంతో మెలగాలని సూచించారు. సిఎం, పిసిసి అధ్యక్షుడు, డిప్యూటి సిఎంలకు హుకుం కూడా జారీచేసి వెళ్లారు. రెండు ప్రాంతాలకు చెందిన వారు వారివారి వాదనలు బలంగానే విన్నవించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఎలా ఉండాలి, సమైక్యంగా ఉంచితే మరెలా ఉండాలనేదానిపై రోడ్‌మ్యాప్‌ను సంయుక్తంగా తయారు చేసి పెట్టుకోవాలని కోర్‌కమిటీ సమావేశానికి పిలిచినప్పుడు సంయుక్తంగా ఇవ్వాల్సి ఉంటుందని బాధ్యతను ముగ్గురిపై పడేశారు. అయితే రాష్ట్రం విషయంలో కేంద్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యల వల్ల తేట తెల్లం కూడా అయ్యాయి. 2004, 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలన్నింటిని తప్పకుండా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఈసమయంలోనే టిజెఎసి నేతలు సైతం కలిసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు. ఇందులో తెలంగాణా రాష్ట్రం విషయం కూడా ఉంటుందన్నారు. గతరాత్రి విశాఖపట్నం నేత టి. సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్‌ను సైతం కలిశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి ఎమ్మెల్యేను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అయితే దిగ్విజయ్‌ సింగ్‌ను మంగళవారం ఉదయం కలిసిన వారిలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ కంతేటి సత్యనారాయణతోపాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలిసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయనతోపాటు శంషాబాద్‌ విమానాశ్రయం వరకు వెళ్లి సాగనంపి వచ్చారు. రెండు రోజుల పర్యటన పూర్తి కావడంతో ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర నేతల్లో మరోసారి టెన్షన్‌ టెన్షన్‌ వాతావరణాన్నే సృష్టించి వెళ్లారు దిగ్విజయ్‌ సింగ్‌.