తెలంగాణే ఇవ్వండి

ప్రత్యామ్నాయాలు పనిచేయవు : టీ మంత్రులు
హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మినహా ప్రత్యామ్నాయాలేమీ పనిచేయవని టీ మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని పలువురు మంత్రులు కోరారు. బుధవారం శాసనసభ లాబీల్లో మంత్రులు దానం నాగేందర్‌, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ముఖేష్‌గౌడ్‌, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, సారయ్య  వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్యాకేజీలు ఇతర అంశాలేవీ పని చేయవని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తారా లేదా ఏదో ఒకటి తేల్చాలని, ఇంకా ఎంతకాలం ఈ సమస్యను నాన్చుతారని వారు ప్రశ్నించారు. దానం నాగేందర్‌ మాట్లాడుతూ, తెలంగాణపై వెంటనే తేల్చాలని డిమాండ్‌ చేశారు. ప్యాకేజీలతో ఎలాంటి లాభం లేదన్నారు. అసలు తెలంగాణ ఇస్తారో లేదో చెప్పాలన్నారు. మరోమంత్రి డీకే అరుణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాధించలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, తెలంగాణతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. గతంలో పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, లేనిచో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఘోరంగా ఉంటుందన్నారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి ముఖేష్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణపై తేల్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుందన్నారు. ప్యాకేజీలతో ఎవరూ సంతృప్తి చెందరని మరోమంత్రి సునీతాలక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యంకాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ అభిమతమని, అదే సమస్యకు పరిష్కారమని చెప్పారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, ప్యాకేజీ  వల్ల సమస్యలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్యాకేజీలు ఇస్తుందన్న వార్తలపై మంత్రులు పై విధంగా స్పందించారు. దాదాపు అందరూ మంత్రులు ప్యాకేజీలు అక్కర్లేదని అభిప్రాయపడ్డారు.