తెలంగాణే..ప్రత్యామ్నాయం లేదు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి) :
తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయమే లేదని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం గ్రూప్-1 అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని రంగాల్లో మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల పాలనలో ఇక్కడి వనరులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అన్నీ దోపిడీకి గురయ్యాయని తెలిపారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలతో ఆర్డీవో కావాల్సిన వ్యక్తిగా ఆర్టీవోగానే మిగిలిపోయాడని తెలిపారు. ఇది కాదా వివక్షకు ఉదాహరణ అని ప్రశ్నించారు. ఇంకా ఎన్నాళ్లు వివక్ష ఎందుర్కొంటామని, సీమాంధ్రలు పాలనకు చరమగీతంపాడితే స్వయం పాలన ఏర్పడుతుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణను సీమాంధ్ర ప్రాంతం నేతలంతా మూకుమ్మడిగా అడ్డుకున్నప్పుడు ఇక్కడి కొందరు నేతలు మీసాలు తిప్పిండ్రు, తొడలు కొట్టిండ్రు కానీ రాజీనామాల వరకు వచ్చేసరికి ఎవరూ ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తోడు బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ మాత్రమే రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇకపై ఏ ఒక్క లీడర్ను రాజీనామా చేయమనవద్దని ప్రజలను కోరారు. అలాంటి నేతలను సాధారణ ఎన్నికల్లో మట్టి కరిపించాలని పిలపునిచ్చారు. 15 ఎంపీ, వందకు పైగా ఎమ్మెల్యే సీట్లను గెల్చుకుంటే తెలంగాణ నడిచి వస్తుందన్నారు. జాతీయ స్థాయిలో 32 పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపితే ఈ ప్రాంతంలో ఓట్లు సీట్ల కోసం ప్రయత్నిస్తున్న పార్టీలు అడ్డుకున్నాయని తెలిపారు. ప్రజలు ఇకనైనా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు.