తెలంగాణ అంతటా బంద్ విజయవంతం
‘మార్చ్’ పై ప్రభుత్వ జులుం నిరసిస్తూ..
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని లో కూడా బంద్ ప్రభావం బాగానే కనిపించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రవాణ వ్యవస్థపై పాక్షికంగా బంద్ ప్రభావం పడింది. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కలేదు. కొన్ని రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి జిల్లాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రావాల్సిన అన్ని బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని రూట్లు మినహా యథావిధిగా బస్సులు నడిచాయి. హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లోనూ విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఆదివారం తెలంగాణ మార్చ్‌కు వస్తున్న వారిపై పోలీసుల దౌర్జన్య కాండను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాల్లో బాగానే కనిపించింది. హైదరాబాద్‌లో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో యథావిధంగా జనజీవనం సాగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచే తెలంగాణవాదులు రోడ్డెక్కారు. అన్ని డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా, వ్యాపార సంస్థలు తెరచుకోలేదు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణవాదులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్తలు స్వచ్ఛందంగానే బంద్‌లో పాల్గొన్నాయి. ప్రభుత్వ, పోలీసుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ ప్రకటించాలంటూ పలువురు వాటర్ ట్యాంక్ ఎక్కారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ఱెడ్డి ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు.ఉ రాష్ట్ర సాధన కోసం మంత్రి వెంటనే తన పదవికి రాజీనమా చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ముందస్తుగానే గ్రామాలకు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం బాగానే కనిపించింది. విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. బస్సుల రాకపోకలను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు అందరూ కలిసి నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. ఆ తర్వాత యథావిధిగా నడిచాయి. గ్రావిూణ ప్రాంతాలకు సాయంత్రం వరకూ బస్సులు బయల్దేరలేదు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. వికారాబాద్‌లో ఏబీవీపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మరోవైపు, వికారాబాద్‌లో రెండు ప్యాసెంజర్ రైళ్లను తెలంగాణవాదులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే, బస్సులను రద్దు చేయలేదని ఆర్టీసీ ప్రకటించింది. అయితే, హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన పలు సర్వీసులను నిర్ణీత షెడ్యూల్ కంటే ఆలస్యంగా వెళ్తాయని పేర్కొంది. మరోవైపు, తెలంగాణ ప్రాంతం విూదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.