తెలంగాణ అంత వీజీకాదు

అయినా మేమే పరిష్కరిస్తాం : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం సమస్య పరిష్కరించడం అంతసులువు కాదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నిండుసభలో ప్రకటించారు. గత అయిదు రోజులుగా తెలంగాణా తీర్మానం కోసం వాయిదా పడుతున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీకే కాదు, ఏ పార్టీకి తెలంగాణ సమస్య తేల్చడం సాధ్యం కాదన్నారు. కేంద్రంలో బలంగా ఉన్న యూపీఏ మాత్రమే పరిష్కరిస్తుందన్నారు. ఈసమస్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదని గత 50 ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యన్నారు. దీనికోసం అంతగా తొందరపడాల్సినవసరం లేదన్నారు. అయినా కూడా కాంగ్రెస్‌ పార్టీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఈనెల 14న జరిగిన చలో అసెంబ్లీ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. తక్కువ అరెస్టులతో తమ ప్రభుత్వం, పోలీసులు సంయమనంతో వ్యవహరించారన్నారు. తెలంగాణవాదం తగ్గించాలన్న ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదన్నారు. సభ సజావుగా ఎందుకు సాగడం లేదో ప్రజలకు తెలుసునని అన్నారు. సభ సజావుగా సాగక పోవడానికి సభాపతిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.