తెలంగాణ అభివృద్ది టిఆర్ఎస్తోనే సాధ్యం
ఎంపీ సీతారాంనాయక్
మహబూబాబాద్,నవంబర్20(జనంసాక్షి): తెలంగాణను అభివృద్ది చేసి, కరెంట్ కష్టాలను తొలగించిన
టీఆర్ఎస్కు మాత్రమే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. గతంలో పాలన చేసిన వారు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారో చెప్పలన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే మాయా కూటమి ఏర్పడిందన్నారు. కేసీఆర్ శరవేగంతో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓటర్లు మరోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. పోడు భూముల విషయంలో గిరిజనులు, గిరిజనేతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం భూములను గుంజుకుంటుందనే ఆరోపణలు కొట్టి పారేయాలని ఆయన సూచించారు. పేద ప్రజలు మెచ్చుకునే సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మద్దని, లేని అబద్దాలను సృష్టిస్తున్నారని సీతారాం నాయక్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తెటీడీపీకి తెలంగాణలో ఏముందన్నారు. పది సీట్లతో వచ్చేదేముందని, కాంగ్రెస్కు స్వయం పాలన శక్తి లేనందున పరాయి పాలనపై ఆధారపడిందన్నారు. దిక్కు లేక అమరావతి వద్దకు కాంగ్రెస్ నాయకులు వెళుతున్నారంటూ ఆయన వివర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక కేసులు వేయడం జరిగిందని, కేవలం అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందన్నారు. ఇక టీఆర్ఎస్లో ఆశావహులు, అసమ్మతి వాదులు లేరని ఎలాంటి అపోహాలను నమ్మవద్దన్నారు. టిఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విన్నవించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుత అభివృద్ధి కొనసాగు తుందని ఎంపి అన్నారు.