తెలంగాణ అమరుడు రాజిరెడ్డికి కన్నీటి వీడ్కొలు
ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 26 (జనంసాక్షి):
తెలంగాణ మార్చ్ సందర్భంగా పోలీసుల టియర్‌గ్యాస్ దాడిలో గాయపడి గురువారం మృతిచెందిన రాజిరెడ్డిక తెలంగాణవాదులు కన్నీటు వీడ్కోలు పలికారు. వేలాదిమంది తెలంగాణవాదుల మధ్య రాజిరెడ్డి అంతిమయాత్ర జరిగింది. తెలంగాణమార్చ్ నేపథ్యంలో గాయపడి గురువారం సాయంత్రం కెపిహెచ్‌బి కాలనీకి చెందిన రాజిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పార్దీవదేహానికి శుక్రవారంనాడు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్‌రావు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. రాజిరెడ్డి కెపిహెచ్‌బిలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న నెక్లెస్‌రోడ్డులో జరిగిన సాగర్‌హారంలో జరిగిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న టియర్‌గ్యాస్ వల్ల ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. రాజిరెడ్డి అంతిమయాత్ర సందర్భంగా కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పికెట్‌లను కూడా ఉంచారు.ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే: కోదండరాం రాజిరెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి నష్టపరిహరం చెల్లించాల్సిందేనన్నారు. శుక్రవారం రాజిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే రాజిరెడ్డి కుటుంబం రోడ్డు పాలైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వారిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుదన్నారు. ఆ కుటుంబానికి వెంటనే 10 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని కోరారు. అంతేగాక రాజిరెడ్డి చికిత్సకు అయిన ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. ఆ విషయాలపై ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రాజిరెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్దీవదేహానికి శ్రద్దాంజలి ఘటించారు. రాజిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజిరెడ్డి మృతి పట్ల ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం, డీజీపీ పోకడల వల్లే రాజిరెడ్డి కుటుంబం నేడు వీధులపాలైందన్నారు. తక్షణమే రాజిరెడ్డి కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ అందించి ఆదుకోవాలని కోరుతున్నామని చెప్పారు.