తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
కలెక్టర్‌లతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్,మే27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లతో ఆవిర్భావ వేడుకలపై సీఎస్ బుధవారం సవిూక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉదయం 9.30 గంటల నుంచి 11. 30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని తెలిపారు. కవాతు నిర్వహణ, వివిధ శాఖల శకటాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్, నెక్లెస్ రోడ్, హుస్సేన్‌సాగర్, లుంబీని పార్క్, ఆయా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో
అమరవీరుల స్తూపాలను సిద్ధం చేయాలని చెప్పారు. జూన్ 7న ట్యాంక్‌బండ్ వద్ద రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పది జిల్లాల కలెక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. జూన్ 2న గ్రామస్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా పురస్కారాల జాబితా తయారు చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అవతరణోత్సవ తొలి సంబురాలను ఘనంగా నిర్వహించాలని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ఆదేశించారు. అన్ని ఏరియాలతో పాటు బొగ్గు గనుల వద్ద, డిపార్ట్‌మెంట్‌ల వద్ద ప్రభుత్వ షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏరియాలకు కలిపి రూ. 30 లక్షలు మంజూరు చేశారు. కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో సెంట్రల్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. సీఎండీ శ్రీధర్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.