తెలంగాణ ఇచ్చే అవకాశాలు దండిగా…
కలిసి ఉండడానికి పోరాటాలు అవసరం లేదు
తెలంగాణలోనే భావోద్వేగాలు ఎక్కువున్నాయన్నారు
తెలంగాణ సెంటిమెంట్‌ను ఎలా అడ్డుకుంటారన్నారు
కేంద్రం నిర్ణాయానికి వచ్చేసింది, అధిష్టానంతో భేటీ అనంతరం టీజీ వెంకటేశ్
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని చూస్తే తెలంగాణ ఇచ్చే పరిస్థితులు దండిగా కనిపిస్తున్నాయని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ తెలిపారు. తెలంగాణలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారనే ధోరణి అధిష్టానం పెద్దల్లో ఉన్నట్టు తాము గమనించామని అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలను ఏదో రకంగా గట్టెక్కించాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోందన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఒక అవగాహనకు, నిర్ణయానికి వచ్చిందని భావిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చేస్తుందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, విశ్వరూప్ తదితరులు బుధవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవితో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వవచ్చనే భయంతోనే తాము ఢిల్లీకి వచ్చామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే తమ ప్రాంతంలో కూడా ఆందోళనలు జరుగుతాయని అధిష్టానం పెద్దలకు వివరించామన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారని అన్నారు. విడిపోవాలని అనుకున్నప్పుడే పోరాటాలు అవసరమవుతాయని, కలిసి ఉండేందుకు పోరాటాలు అవసరం లేదని టీజీ చెప్పారు. రెండు ప్రాంతాల సమస్య అవడం వల్లనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ అంశం దేశవ్యాప్త సమస్యలతో ముడిబడి ఉందని అన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని గట్టిగా కోరామని చెప్పామని అన్నారు. విభజన అనివార్యమైతే తమకు అన్యాయం చేయవద్దని కోరామని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో మెజార్టీ పార్టీలు తెలంగాణను వ్యతిరేకించలేదని, అంతేగాక ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడి భావోద్వేగాల వల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్ఠానానికి సానుభూతి ఉన్నట్టు కనబడిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సెంటిమెంట్‌ను ఎలా అడ్డుకుంటారని అధిష్టానం పెద్దలు తమను ప్రశ్నించినట్లు టీజీ చెప్పారు. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతం రాయలసీమ అని అధిష్టానం పెద్దలకు వివరించామని అన్నారు. కలిసి ఉన్నప్పుడే సీమలో నీటి కష్టాలు ఉన్నాయని, ఇక విడిపోతే పరిస్థితి ఊహించుకోలేమని తెలిపామన్నారు. సమస్య పరిష్కారం కోసం అధిష్టానం తమనే సూచనలు ఇవ్వాల్సిందిగా కోరిందని చెప్పారు. అధిష్టానం ముందు రెండు, మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలనుకున్న ప్రతిసారి సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారన్న ఆరోపణను ఆయన ఖండించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటున్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడి ప్రజల భావాలను, కష్ట నష్టాలను అధిష్టానానికి వివరించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అందుకే తాము ఢిల్లీకి వచ్చామని చెప్పారు.