తెలంగాణ ఇవ్వకపోతే మాది కుక్కచావే

పార్టీకి పుట్టగతులుండవ్‌
ఆజాద్‌కు తేల్చిచెప్పిన టీ ఎంపీలు
సీమాంధ్ర నేతలతో ఎంపీల వాగ్వాదం
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :
తెలంగాణ ఇవ్వకపోతే తమకు కుక్కచావు తప్పదని, కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులుండవని టీ ఎంపీలు తేల్చిచెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ సందర్భంగా వారు తెలంగాణపై తేల్చాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన ఈ భేటీలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆజాద్‌ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. వారిని ఆజాద్‌ సముదాయించి బుధవారం తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమా వేశమవుతానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ఆజాద్‌ పలు సూచనలు చేశారు. దిగువ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని, సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పథకాలు మంచి ప్రచారం కల్పించాలని అన్నారు. జగన్‌ అవినీతి కేసులతో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేదని కూడా ప్రజల్లో గట్టిగా ప్రచారం చేయాలని ఎంపీలకు సూచించారు. బస్సుయాత్రలు చేపట్టి నాయకులంతా ఐక్యతను చాటాలని ఆజాద్‌ హితవు పలికారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపట్ల ఉన్న అభిమానాన్ని పార్టీకి ఉపయోగపడేలా నాయకులు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు మాట్లాడుతూ, తెలంగాణపై తేల్చకుండా ఎలాంటి సదస్సులు నిర్వహించలేమని, అవి నిర్వహించినా విజయవంతం కావని తేల్చిచెప్పారు. టీ ఎంపీల వాదనను అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ ఖండిం చారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన సభ విజయ వంతమైందని అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సభను విజయవంతం చేయడంలో గట్టి కృషి చేశారని చెప్పారు. తెలంగాణ అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎంపీ కావూరి తదితరులు చెప్పారు. ఈ సందర్భంగా కావూరి ప్రసంగాన్ని తెలంగాణ ప్రాంత ఎంపీలు అడ్డుకున్నారు. దీంతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షిండే నిర్వహించిన అఖిలపక్షం సమావేశం తర్వాత తెలంగాణను తామే అడ్డుకున్నామని అనడం సబబా అంటూ సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణ ఎంపీలు వాదనకు దిగారు. ఇరు వర్గాలను సముదాయించి బుధవారం తెలంగాణ ఎంపీలతో భేటీ అవుతారని ఆజాద్‌ చెప్పారు.ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనితీరుపై మెజారిటీ ఎంపీలు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలుపుకుని పోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒంటెత్తుపోకడలతో సొంత ఇమేజ్‌ కోసం పని చేస్తున్నారని వారు ఆరోపించారు. వి.హనుమంతరావు, వివేక్‌ సహా పలువురు ఎంపీలు ముఖ్యమంత్రి తీరుపై ఫిర్యాదు చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉన్నదని ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆజాద్‌కు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రికి ఎంపీలు హర్షకుమార్‌, అనంత వెంకటరామిరెడ్డి బాసటగా నిలిచారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో పార్టీకి మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి పలు పథకాలను ప్రజల్లోకి సీరియస్‌గా తీసుకుపోతున్నారని అన్నారు. మరో ఎంపీ సాయిప్రతాప్‌ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై తాము మంత్రులకు లేఖలు రాసినా పంపించడం లేదని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన బంగారు తల్లి పథకం ఆయనపై రాష్ట్ర నాయకులలో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత బయటపడేలా చేసింది. ఇప్పటికే అసంతృప్తి నేతల అభిప్రాయాలను నివేదిక రూపంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఇన్‌చార్జి ఆజాద్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలో బొత్సకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. డీఎల్‌ వంటి అసంతృప్త మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఎంపీలు కూడా ముఖ్యమంత్రిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏదేమైనా, రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించాలనుకుంటున్న అధిష్టానం మరింత త్వరగా ఆ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నది. అందువల్లనే ఐక్యత చాటాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచాయగా సూచించారని తెలుస్తోంది.