తెలంగాణ ఇవ్వరు పార్టీని వీడండి : కేకే

గ్రామాల్లోకొచ్చేందుకే కాంగ్రెస్‌ ముసుగు పోరాటం
కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని, ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో టీ కాంగ్రెస్‌ నేతలు పార్టీ వీడి బయటకు రావాలని టీఆర్‌ఎస్‌ జాతీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు పిలుపునిచ్చారు. ఇప్పటికే టీ కాంగ్రెస్‌ నేతలను ద్రోహులుగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన సందర్భంగా, గురువారం కేశవరావును టీ జేఏసీ నేతలు కోదండరామ్‌ , దేవీప్రసాద్‌ తదితరులు ఆయన నివాసంలో కలిసి అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వదని తెలిసే తాను బయటకు వచ్చానని పేర్కొన్నారు. తెలంగాణపై ఐక్య పోరాటాలు చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. గవర్నర్‌ నుంచి నివేదికలు తీసుకుని కేంద్రానికి ఇవ్వడం, దానికి కేంద్రం తలలూపడం సరైంది కాదన్నారు. ప్రజలను కించపరిచే విధంగా గవర్నర్‌ నివేదికలు ఇవ్వడం ప్రజాస్వామ్యం అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో ఉండలేమని, పోటీ చేయలేమనే భావనతో మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని కేకే పెర్కొన్నారు. ప్యాకేజీలంటే ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునేది లేదన్నారు. ఇంతకంటే నీచమైన ప్రతిపాదన ఇంకోటి ఉండదన్నారు. ఇలాంటి ప్రతిపాదనలన్నీ కాలగర్బంలో కలిసి పోయినవేనని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, గ్రామాల్లోకి వచ్చేందుకే కాంగ్రెస్‌ ముసుగు పోరాటానికి తెరతీసిందని అన్నారు. అందులో భాగంగానే ఈనెల 30న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రజలెప్పుడో బహిష్కరించారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుతంత్రాలు చేసినా వారిని గ్రామాల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. ఈమేరకు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.