తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీం కావాలె
ప్రత్యేక రాష్ట్రంతోనే ఆదివాసీల అభివృద్ధి
అడవిపై హక్కులు ముమ్మాటికీ మీవే
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, ఆగస్టు 9 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీంలా ఉద్యమించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆది వాసీలకు పిలుపునిచ్చారు. గురు వారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నదని విరుచుకుపడ్డారు. ఏడాదికోసారి నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కూడా తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో ఆదివాసీల బతుకులు మెరుగు పడాలంటే, వాళ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, అది ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే సాధ్యమవుతుందని కోదండరాం ఆదివాసీలకు వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆదివాసీల అభివృద్ధికి ఎలా పని చేయాలన్న దానిపై తమకు స్పష్టమైన ప్రణాళికలున్నాయని తెలిపారు. ఆ ప్రణాళికల అమలు సమైక్య రాష్ట్రంలో సాధ్యం కావని, సాధ్యమైనా సీమాంధ్ర పాలకులు తమ ప్రాంతంలో వాటిని అమలు చేస్తారే గానీ, తెలంగాణ ఆదివాసీల అభ్యున్నతికి ఉపయోగిస్తారన్న తమకు లేదని స్పష్టం చేశారు. 1/70 చట్టాన్ని ఎంత వరకు ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్నదో అందరికీ తెలంగాణలో అమలు చేస్తున్నదో అందరికీ తెలిసిందేనన్నారు. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని సీమాంధ్ర నాయకులు తెలంగాణలో ఆదివాసీలకు చెందాల్సిన భూములను దర్జాగా ఆక్రమించుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి, అక్కడి వనరులను దోచుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నారని, ఇందు కోసం వారికి ప్రభుత్వం సహకరిస్తున్నదని విమర్శించారు. అడవులపై సర్వ హక్కులు ముమ్మాటికీ ఆదివాసీలవేనని, ఆదివాసీలపై దౌర్జన్యం చేయాలని చూస్తే, తెలంగాణ ఉద్యమ తరహాలోనే పోరాటాలకు సిద్ధపడుతామని కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చివరగా తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీలు కూడా కదంతొక్కుతున్నారని, ఇది అభినందనీయ పరిణామమని ఆయన వెల్లడించారు. ప్రతి ఆదివాసీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగుతున్న పోరాటంలో ఓ కొమురం భీంలా గర్జించి, సీమాంధ్ర పాలకుల గుండెల్లో గుబులు పుట్టించాలని కోదండరాం పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ 30న టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ మార్చ్’కు ఆదివాసీ దండులా కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు.