తెలంగాణ ఉద్యమం ఉధృతం
23, 24న కర్నూల్, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం
మార్చిలో చలో అసెంబ్లీ
మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు
తెలంగాణ సాధించే వరకూ నిరంతర పోరు : కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (జనంసాక్షి):
తెలంగాణ సాధన కోసం కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ ప్రకటన అవరోదాలు తొలగిపోయినా ప్రకటన చేయకుండా కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని జేఏసీ విమర్శించింది. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టి తెలంగాణ సాధించుకునేందుకు భారీస్థాయి ఉద్యమానికి టి.జేఏసీ కార్యాచరణ రూపొందించుకుంది. ఆదివారంనాడు సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిల్మిఛాంబర్ కార్యాలయంలో టి.జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం టి.జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా రహదార్ల దిగ్బంధం, చలో అసెంబ్లీ, తెలంగాణ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసనలు, తదితర కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. టి.జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ గతంలో నిర్ణయించుకున్న ‘కాంగ్రెస్‌కో ఖతం కరో-తెలంగాణకు ఆసిల్ కరో’ అన్న నినాదం మేరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు లేదని తెలిసినా నిర్ణయం ప్రకటించడానికి అవంతరాలు తొలగిపోయినా, చెప్పిన గడువు28లోగా ప్రకటన చేయకపోవడం తెలంగాణ ప్రజలను వంచించినట్టేనని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు దీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా పార్టీని వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలతో కలిసి ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. తమ
ఉద్యమంలో భాగంగా రహదార్ల దిగ్బంధంతో పాటు అసెంబ్లీ జరిగే రోజుల్లో చలో అసెంబ్లీ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. తెలంగాణ మంత్రుల వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెల 16 నుంచి 21 వరకు ఐదురోజుల పాటు వారి నియోజకవర్గాల్లో జేఏసీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఈ నెల 11, 12, 27, 28 తేదీల్లో తెలంగాణ గ్రామాల్లో బస్సు యాత్రలు చేసి ప్రజలను సమైక్యపరుస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ప్రకటించిన తర్వాత చలో అసెంబ్లీ తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మోసాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. టి.జేఏసీ సమన్వయకర్త, టిజిఓ అధ్యక్షుడు వి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని విమర్శించారు. వచ్చిన తెలంగాణ వెనక్కిపోవడానికి తెలంగాణ ప్రజాప్రతినిధులలో ఐక్యత లేకపోవడమే కారణమని ఆయన విమర్శించారు. ఉద్యమ కారులవైపు నిలబడకుండా ప్రజల ఆకాంక్ష గమనించకుండా వ్యవహరిస్తున్న వీరిపై పోరాడాలని , వారిని ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ వారి నియోజకవర్గాల్లో నిరసనలు, యాత్రలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. ఈ నెల 23, 24 తేదీలలో కర్నూలు, బెంగళూరు, మార్చి 2వ తేదీన విజయవాడ జాతీయరహదారులను దిగ్బంధం చేయాలని జేఏసీ సమావేశం తీర్మానించిందన్నారు. కర్నూలు జాతీయరహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ మార్గంలోని ప్రజలను చైతన్యం పరిచేందుకు ఈ నెల 11, 12న శంషాబాద్‌నుంచి ఆలంపూర్ వరకు, అలాగే మార్చి 2న తలపెట్టిన విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధనాన్ని విజయవంతం చేసేందుకు 27, 28 తేదీలలో హయత్‌నగర్ నుంచి కోదాడవరకు బస్సు యాత్రను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా మార్గాల్లో రహదార్ల దిగ్బంధనం రోజున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చైతన్యపరచాలని నిర్ణయించినట్టు చెప్పారు. జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఉద్యమకారులను కేసుల పేరిట భయపెట్టి ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉద్యమకారులు కేసులకు భయపడబోరని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో విద్యార్థులు, ఉద్యమకారులపై ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులపై పోలీసులు రౌడీషీట్లు తెరవడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. ఉద్యమం అణచివేత, రాజకీయ కక్షసాధింపులు, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కేసిఆర్, కోదండరామ్, తెలంగాణ ఉద్యోగులపై కేసులు పెట్టాలని చూస్తున్న ప్రభుత్వ ధోరణిని ఖండించిందని తెలిపారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగానే ఉద్యోగులంతా తమ హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుందనే భయం ఏర్పడినప్పుడల్లా ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఉద్యమిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులపై కేసులు పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తామని, హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఏమైనా చేస్తామని ఆయన అన్నారు. యుపిఎ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 20, 21వ తేదీలలో దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెకు జేఏసీ మద్దతిస్తుందని ప్రకటించారు. నూతన పెన్షన్ విభాగం, ఎఫ్‌డిఐ, కాంట్రాక్టీకరణ తదితర కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరగబోయే ఈ సమ్మెకు తామంతా పూర్తి మద్దతును ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు కె.రఘు, అద్దంకి దయాకర్, టిఆర్‌ఎస్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి, శ్రవణ్‌లతో పాటు న్యూడెమోక్రసి, సిపిఐ పార్టీల నేతలు పాల్గొన్నారు.