తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..
తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్
టీఎన్జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్
హైద్రాబాద్,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్జీవో తాజా మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీఎన్జీవోల అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్ మంగళవారం ప్రభుత్వ ఉద్యోగానికి పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన దేవీప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలను స్వామిగౌడ్ ప్రకటిం చారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించే వరకూ పోరు బాట వీడేది లేదని ఆయన అన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో టీఎన్జీవోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనీ, అదే సమయంలో 10 పీఆర్సీ నియామకంతో పాటు, ఉద్యోగుల డిమాండ్ల సాధన విషయంలో టీఎన్జీవోలు ముందుంటారనీ పేర్కొన్నారు. పదవీవిరమణ తదనంతరం కూడా తెలంగాణ ఉధ్యమానికి పునరంకితమవుతానని స్పష్టం చేశారు. ఉధ్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకు తనపై హత్యాయత్న ప్రయత్నం జరిగిందనీ, తనను భయపెట్టాలని చూశారని అయితే ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చారు. తన వెన్నంటి ఉండి ఉధ్యమాల్లో తమ సహాయ సహకారాలను అందించిన టీఎన్జీవోలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉధ్యమంలో 1969 తర్వాత 2009 నుండి టీఎన్జీవోలు తచురుకైన పాత్ర పోషిస్తున్నారనీ, పేర్కొన్నారు. ఇదే స్పూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. తెలంగాణలో మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.