తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నేతలు
భద్రత పెంచిన పోలీస్ యంత్రాంగం
కంటివిూద కునుకు లేకుండా పర్యవేక్షణ
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): తెలంగాణ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూసుకుపోతున్నారు. అంతా విఐపిలే కావడంతో వారు ప్రచారంలో పాల్గొంటున్న దశలో వారికి భద్రత కల్పించడం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో ఇక్కడికి వస్తున్న ప్రముఖులకు రాష్ట్రంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడం, రాష్ట్రవ్యాప్తంగా అగ్రనేతల ప్రచారసభలు నిర్వహిస్తుండడంతో పోలీసులు నిఘా పెంచారు. ప్రధాని నరేంద్రమోదీ, ఎఐసిసి రాహుల్ గాంధీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, సీఎం కేసీఆర్, ఎపి సిఎం చంద్రబాబు, మాయావతి, పలువురు కేంద్ర మంత్రులు సహా అన్ని పార్టీలకు చెందిన స్టార్‌క్యాంపెయినర్లు సుడిగాలి పర్యటనల నేపథ్యంలో భద్రత కత్తివిూదసాములా మారింది. ఒకవైపు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూనే, అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో బహిరంగ సభలు, సమావేశాలు పెరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేవాల మేరకు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. ఎస్పీజీ భద్రత ఉన్నవారు కూడా ప్రచారాలకు
వస్తున్నందున ప్రత్యేక భద్రత అవసరం అవుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ గ్రేహౌండ్స్‌తో పాటు కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రత కల్పిస్తున్నారు. మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా నిఘాపెట్టారు. విజయవాడలో ఇద్దరు మావోయిస్టు ముఖ్యనేతలు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. మరోవైపు డబ్బు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే కోట్లలో డబ్బు పట్టుబడుతోంది. మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కంటివిూద కునుకులేకుండా పోయింది.