‘తెలంగాణ’ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ ప్రజలకు హక్కులు లేవా
ఇనుప కంచెలతో మమ్మల్ని హరిస్తారా
సర్కారుపై ఈటెల ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
రాష్ట్ర శాసనసభ నుంచి తెలంగాణ (టీఆర్‌ఎస్‌, బీజేపీ) ఎమ్మెల్యేలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సస్పెండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేయాల్సిందేనని పట్టుబడుతున్న టీఆర్‌ఎస్‌, బిజెపి ఎమ్మెల్యేలతో పాటు నాగం జనార్దన్‌రెడ్డిని స్పీకర్‌ రెండు రోజులపాటు సస్పెండ్‌ చేస్తూ ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశం వాయిదా వేసిన అనంతరం స్పీకర్‌ ఫ్లోర్‌లీడర్ల సమావేశం నిర్వహించి సభ నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ సమావేశం అనంతరం సభను ప్రారంభించగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ ఆదేశంతో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెన్షన్‌ వేటువేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్‌ ఓటింగ్‌కు ప్రయత్నించి సభ్యులను సస్పెండ్‌ చేస్తూ, సభ్యులను బయటకు వెళ్లిపోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 16మంది, బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు, నాగం జనార్దన్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసమస్యలను చర్చించకుండా అడ్డుపడుతున్నందునే సస్పెండ్‌ చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఈ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్లశ్రీధర్‌బాబు ప్రవేశపెట్టాల్సి ఉండగా ఆయన కూడా తెలంగాణకు చెందిన వ్యక్తే కావడంతో రాబోయే రోజుల్లో తెలంగాణా నేతలకు తీవ్ర ఇక్కట్లు తప్పవని భావించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఆనంతో తీర్మానం ప్రవేశపెట్టించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీ సందర్భంగా వేలాది మందిని బైండోవర్‌ చేశారని, లక్షలాది మందిని అరెస్ట్‌లకు గురిచేసి తీవ్ర కష్టాలకు గురిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందని మాత్రం తాము అనుకోవడంలేదన్నారు. వేలాది పోలీసుల బలగాలను దింపి ప్రజలను చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్బంగా ముప్పుతిప్పలు పెట్టారని, ప్రజల హక్కులను ప్రభుత్వం హరించి వేసిందన్నారు. తెలంగాణా ప్రజలకు ఏహక్కులు కూడా లేవా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ చుట్టూ ఇనుప కంచె వేసి తెలంగాణవాదులపై ఉక్కుపాదం మోపారన్నారు. తెలంగాణాపై ప్రభుత్వం ఇంక ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికీ నాన్చుతూ వస్తున్న కాంగ్రెస్‌కు సమాధికట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం మాటమార్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను అణగద్రొక్కుతూ స్పీకర్‌, సీఎం చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై దమనకాండ కొనసాగుతోందన్నారు.