తెలంగాణ కరెంటు వాటా తేల్చి అడుగుపెట్టు

5

బాబు వరంగల్‌ పర్యటనపై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఎంతో పక్కనున్న ఎపి సిఎం చంద్రబాబు కూడా తమకు అంతేనని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బాబు తెలంగాణ పర్యటనను తాము అడ్డుకోబోమని అన్నారు. ఆ అవసరం తమకు లేదన్నారు. ఆ పనిని ప్రజలు ఎప్పుడో చేశరాని, ఇకముందుకు కూడా చేస్తారని అన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ పేరును మార్చుకోవాలని తారకరామారావు సూచించారు.  తెలుగుదేశం పార్టీ పేరును ‘పక్కదేశం పార్టీ’గా మార్చుకోవాలని అన్నారు. ఓవైపు ఖజానాలో డబ్బులు లేవంటూనే మరోవైపు రూ.15 కోట్లతో తన ఛాంబర్‌ను  మరమ్మతు చేయించుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. చంద్రబాబు వరంగల్‌ పర్యటనకు ముందే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కరెంట్‌, నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణపట్నం వాటా విషయంలో వివరణ ఇవ్వాలన్నారు. తన శాఖకు సంబందించిన అధికారులకు ఇన్నోవా వాహనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం జెండావూపి మంత్రి ప్రారంబించారు.  తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు.తెలంగాణకు ,చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం టిడిపి బదులు పిడిపిగా పేరు మార్చుకోవాలని, అంటే పక్కదేశపు పార్టీగా మార్చుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు ను పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూస్తామని అన్నారు.ఆయన హైదరాబాద్‌ ను విదేశంతో పోల్చారని, ఆయన కావాలంటే ఇక్కడ ఉండవచ్చని,లేకుంటే పోవచ్చని అన్నారు. అందుకే చంద్రబాబు పర్యటనను తాము కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల పర్యటనల్లా చూస్తామని చెప్పారు. చంద్రబాబు తెలంగాణ వాటా విద్యుత్‌, కృష్ణా నీళ్లను తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కరెంట్‌, నీటి వాటాలు ఇచ్చాకనే చంద్రబాబు పర్యటనకు రావాలని సూచించారు. చంద్రబాబు వరంగల్‌ పర్యటనకు రాకముందే తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఇవ్వాలన్నారు. తెలంగాణ వాటాను తరలించుకుపోతున్న చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.