తెలంగాణ కోసం టీఆర్‌ఎస్, టీజేఏసీ కలిసే ఉద్యమిస్తాయి..
– చంద్రబాబు అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి
– సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే : కేటీఆర్
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్, టీజేఏసీ..
రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోయే కాలం దగ్గర పడిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల తారాకరామారావు అన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్‌ఎస్ మరోమారు ఉద్యమిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ తప్పూ చేయలేదని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. బుధవారం టీఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ విూడియాతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్ శాంతియుతంగా జరిగిందని, ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. కేసులు పెట్టాల్సి వస్తే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ¬ం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపైనే పెట్టాలని డిమాండ్ చేశారు. మార్చ్‌కు అనుమతిచ్చి అడ్డుకోవడం, పోలీసులను మోహరించి రెచ్చగొట్టిన వారిపైనే కేసులు బనాయించాలన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్‌ఎస్ మరోమారు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని, ప్రభుత్వంపై ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని, అందుకే ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు.. ఆయనకు పోయే కాలం దగ్గరపడడంతో.. ఇలా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని మంత్రులతో పాలన నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఏ శాఖ ఏ పని చేస్తుందో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. పారదర్శక పాలనకు కిరణ్ పాతర వేశాడని ధ్వజమెత్తారు.
సీబీఐ దర్యాప్తుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ఏ తప్పు చేయలేదని భావిస్తే దర్యాప్తుకు సిద్ధం కావాలని సూచించారు. ఐఎంజీ భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించానని భావిస్తే.. సీబీఐ విచారణను ఎదుర్కొవాలన్నారు. చంద్రబాబు పాదయాత్రను ప్రస్తావిస్తూ.. ఆయన ప్రజలపై లేటు వయస్సులో ఘాటు ప్రేమ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేయడం లేదని, కుర్చీ కోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన యాత్ర పేరును ‘వస్తున్నా.. విూ కోసం’ అని కాకుండా.. ‘చస్తున్నా కుర్చీకోసం’ అని పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. టీ-జేఏసీని ఏర్పాటు చేసిందే కేసీఆర్ అని అన్నారు. పార్టీ స్వార్థం కోసమే అయితే, జేఏసీని ఏర్పాటు చేసేవాళ్లమే కాదన్నారు. ఏవైనా ఒకటి, రెండు అభిప్రాయ భేదాలు ఉన్నా.. వాటిని సర్దుకుంటామన్నారు. జేఏసీ-టీఆర్‌ఎస్ కలిసే తెలంగాణ కోసం ఉద్యమిస్తాయన్నారు. జేఏసీని మరింత
బలోపేతం చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము ఎలాంటి డెడ్‌లెన్లు పెట్టలేదని, పెట్టబోమని కేటీఆర్ అన్నారు. దసరా కల్లా తెలంగాణ వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… ఇది ప్రభుత్వానికి తాజఆ డెడ్‌లైనా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు. తెలంగాణ వచ్చే వరకు తాము ఉద్యమిస్తామని అన్నారు. కేసీఆర్ చర్చల వల్లే ఢిల్లీలో తెలంగాణపై కదలిక వచ్చిందన్నారు.