తెలంగాణ కోసం టీఎంపీల సత్యాగ్రహం

బాపూజీ సాక్షిగా 48 గంటల దీక్ష
లోక్‌సభలో ప్రస్తావిస్తాం : సుష్మ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో 48 గంటల దీక్ష చేపట్టారు. పార్లమెంట్‌ ఒకటో నెంబర్‌ గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ సాధన కోసం 48 గంటల పాటు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. పార్లమెంట్‌ ఆవరణలో    టీ-ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇదే చివరి అవకాశమన్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించి తెలంగాణలో, అలాగే, సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడాలని కోరారు. తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ లోపల, బయటా ఆందోళన కొనసాగిస్తామన్నారు. వివిధ సమస్యలతో పార్లమెంట్‌ తరచూ వాయిదా పడుతోందని అందుకే తాము పార్లమెంట్‌ ఆవరణలో 48 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద టీ-జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీ ఎంపీలకు మద్దతు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ, తెలంగాణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తున్నా కాంగ్రెస్‌ బిల్లు పెట్టకుండా కావాలనే జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణలో అమాయక విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి ఇప్పటికైనా ముగింపు పలకాలని కోరారు. దీక్షలో ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య, డాక్టర్‌ గడ్డం వివేకానంద పాల్గొన్నారు.