తెలంగాణ కోసం బీటెక్, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం
ఆజాద్ కూతలకు కలతచెంది
తెలంగాణ కోసం బీటెక్, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం
హైదరాబాద్ /బీమదేవరపల్లి (జనంసాక్షి):
తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలకు కలత చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన దినేశ్(21) తన అక్కతో కలిసి హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో అద్దెకు ఉంటున్నాడు. దినేశ్ బండ్లగూడ అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు దినేశ్ ఉంటున్న గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. వారు
అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు. అక్కడ దినేశ్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌కు చెందిన తడగొన అజయ్ (21) అనే డిగ్రీ విద్యార్థి బుధవారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.