తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం

 అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
 రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):-
భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమై 75 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వజ్రోత్సవాల నోడల్ అధికారి ఆర్డీవో వెంకటాచారితో కలిసి ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ అధికారికంగా నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలను దిగ్విజయం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈనెల 16, 17, 18 తేదీలలో మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించిందని చెప్పారు. 16న నియోజకవర్గ కేంద్రంలో పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని 17న జాతీయ జెండాల ఆవిష్కారం, 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. 16న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ నుంచి క్యాంపు కార్యాలయం గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు, అన్ని శాఖల అధికారులు పాల్గొనే విధంగా సమీకరణ చేయాలని ఎమ్మెల్యే సుచించారు.  నిజాం సంస్థానం ఏలుబడిలో ఉన్న తెలంగాణప్రాంతం భారతదేశంలో విలీనమైన చరిత్ర, నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటి తరానికి తెలపడానికే తెలంగాణ ప్రభుత్వం ఈ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు రామంజులరెడ్డి, జ్యోతి, అమరేందర్ రెడ్డి, యూసుఫ్ తహసిల్దార్ లు రామ్మోహన్, అనిత, సుచరిత, అనిత రెడ్డి ఎంపీడీఓలు మమతబాయి,  శ్రీనివాస్, విజయలక్ష్మి క్రాంతి కిరణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి కర్నాటి రమేష్ గౌడ్, బుగ్గ రాములు, చీరాల రమేష్, జెర్కోని రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area