తెలంగాణ నడిగడ్డపై తొడకొట్టిన కిరణ్‌

బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం
ఏం చేస్తావో చేస్కో
కేసీఆర్‌కు సీఎం హెచ్చరిక
నోరు మెదపని తెలంగాణ మంత్రులు
సంగారెడ్డి, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణ నడిగడ్డపై ముఖ్యమంత్రి తొడకొట్టాడు. బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం ఏం చేస్తావో చేస్కో అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను హెచ్చ రించారు. ఇక్కడ ప్రజలకు చెందాల్సిన ఇనుస ఖనిజాన్ని ఎత్తుకెళ్తామని సీఎం బాహాటంగా చెప్తున్నా వేదికపైనే ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రులు కనీసం నోరుకూడా మెదపలేదు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో అమ్మహస్తం ప్రారం భించిన అనంతరం ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. భూకంపాలు సృష్టించినా తట్టుకుని ముందుకెళ్లే ధైర్యం తమకుందని, బయ్యారం గనులను విశాఖకు తరలించి తీరుతామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను బెదిరింపులతో కెసిఆర్‌ అడ్డుకుంటున్నారని సిఎం మండిపడ్డారు. ఆడపిల్ల పుడితే రూ. 2,500 నగదు అందిస్తామని సీఎం చెప్పారు. మే 1 తర్వాత పుట్టిన పిల్లలకు ఇది వర్తిస్తుందని, ఈ పథకం కింద డిగ్రీ పూర్తయ్యే నాటికి బంగారు తల్లికి లక్షా 55వేల నగదు అందుతుందన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటి వరకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగ కూడదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో వ్యాపారం చేస్తున్నది ఎవరో, నిజమైన ఉద్యమం చేస్తున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసని సీఎం అన్నారు. బయ్యారం గనులు రక్షణ స్టీల్స్‌కు కేటాయిస్తే కేసీఆర్‌ ఎందుకు మాట్లాడ లేదని ఆయన ప్రశ్నించారు. ఆనాడు బెల్లం కొట్టిన రాయిలా ఉండి ఇవాళ బయ్యారం గనులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయిస్తే అడ్డుకుంటామని చెప్పడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయించడం వల్ల తెలంగాణకు లాభమేనని ముఖ్యమంత్రి చెప్పారు. దీనివల్ల తెలం గాణలో పరిశ్రమ వచ్చి లాభం కలుగుతుందని అన్నారు. ఇలా చేస్తే కెసిఆర్‌ భూకంపం సృష్టిస్తానని బెదిరిస్తున్నారని, భూకంపాలు వస్తే తట్టుకుని ముందుకు వెళ్లే ధైర్యం మాకుందని అన్నారు. బయ్యారం గనులను విశాఖకు తరలించి తీరుతామని ఏం చేసుకుంటారో చేసుకోవాలని సిఎం తీవ్రంగా హెచ్చరించారు. ఇక బంగారు తల్లి పథకం గురించి వివరిస్తూ ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టిందని భావించే వారమని నేడు పుట్టక ముందే అబార్షన్‌ చేయించేస్తున్నారని, తండ్రులే కన్న ఆడపిల్లలను హత్యచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడపిల్లకు అండగా నిలబడేందుకు బంగారు తల్లి పేరుతో పథకాన్ని చేపడుతున్నామన్నారు. ఆడపిల్లగా పుడితే ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలనే విధంగా ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఆడపిల్ల పుడితే నెలకు వెయ్యి రూపాయలు, అంగన్‌వాడీలో 1500 రూపాయలు, అయిదు సంవత్సరాల వరకు నిధి ఇస్తున్నామన్నారు. ఒకటో తరగతి నుంచి అయిదవరకు 2వేలు, 9నుంచి 10వరకు 3వేలు, ఇంటర్‌ వరకు 3500 రూపాయలు, గ్రాడ్యుయేషన్‌లో అయిదువేలు ఇస్తామన్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి కాగానే మరో లక్ష రూపాయలు చెల్లిస్తామన్నారు. పెళ్లి 18సంవత్సరాలు దాటాలనేది ప్రధాన నిబంధన ఉందన్నారు. ఇంటర్‌లోనే చదువు నిలిపివనేస్తే 55వేల రూపాయలిస్తామన్నారు. సమాజంలో మార్పు రావాల్సినవసరం ఉందన్నారు. ఆడపిల్ల పుడితే బరువుగా భావించవద్దన్నారు. తల్లి, భార్య, చెల్లి, కూతురులను కూడా గౌరవించాలన్నారు. పుట్టకముందే చంపడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. జననీ సురక్ష యోజన, సుఖీభవతోపాటు తదితర ఉపకారాలు అందిస్తూనే బంగారు తల్లి కార్యక్రమం వర్తింపచేస్తున్నామన్నారు. మే 1వతేదీనుంచి పుట్టిన వారందరికి ఈ పథకం అందిస్తామన్నారు.

పచ్చతోరణం పేరుతో ఉపాధి హామీలో 200 చెట్లు, స్థలం అందజేస్తామన్నారు. లక్ష ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం అందిస్తామన్నరు, నెలకు 3వేల రూపాయల చొప్పున అయిదు సంవత్సరాలు ఇస్తామన్నారు. ఆతర్వాత వారికే ఫలితం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడున్నర లక్షల మంది గర్భిణులకు నేడు అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం పెడుతున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో స్టీల్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తేనే ఖనిజం మంజూరు చేస్తామని ఒప్పందం చేసుకున్నామని, ప్రస్తుతం సర్వే మాత్రమే చేస్తున్నారని వాస్తవాలు తెలుసు కోకుండా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నా యని ముఖ్యమంత్రి ఆరోపించారు. బయ్యారం కేటా యింపులు రద్దుచేసే ప్రసక్తే లేదన్నారు. బయ్యా రంలో గతంలో 55వేల హెక్టార్ల ఖనిజాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించినప్పుడు బెల్లంకొట్టిన రాయిలా కెసిఆర్‌ వ్యవహరించారని, వాటిని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ ఉక్కుకు కేవలం అయిదువేల హెక్టార్లు కేటాయిస్తే నానా రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. బయ్యారంలో పెలిటలైజేషన్‌ కర్మాగారంతోపాటు, శుద్ధి యూనిట్‌ను నెలకొల్పాలనేది ప్రథమ ఒప్పందంలో ప్రథమ డిమాండ్లన్నారు. ఆ తర్వాత స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం సర్వేచేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలనేది మరో ఒప్పందమన్నారు. కేసిఆర్‌ రద్దుచేయాలని కోరడం ఏం న్యాయమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. భూకంపం సృష్టిస్తానంటున్నాడు చేయాలని సవాల్‌ విసిరారు. తెలంగాణాలో మేలు చేసేందుకే ఈకార్యక్రమం చేస్తున్నామన్నారు. వైసిపి నేతలు గిరజనులకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. కేంద్రప్రభు త్వానికి సంబందించిన సంస్థ ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమాలవల్లే వందలాది మంది యువకలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిం చారు. ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఆరోప ిస్తున్నారు. ఎవరు ఉద్యమాన్ని వ్యాపారం చేసుకు న్నారో అందరికి తెలుసన్నారు. 1975-76 లోఎస్సీ, 1979-80 సంవత్సరాల్లో ఎస్టీలనిధుల కు చట్ట బద్దం కల్పించే ఉద్దేశ్యంతో ఇందిరాగాంధీ ప్రయత్నించినా కాలం కలిసి రాకపోవడం వల్ల అమలు సాధ్యం కాలేదన్నారు. అయితే ఆనాటి ఆలోచనను ఆమె కోడలు సోనియాగాంధీ సూచన మేరకు తాము రాష్ట్రంలో నేడు ఆఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేశా మన్నారు. వందల ఏళ్లుగా ఎస్సీలు, అట్టడుగునే ఉంటూ దినదినం గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టున్నందునే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఎస్టీసబ్‌ప్లాన్‌ పథకాన్నితీసుకురావడం జరిగిందనిముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీలఅభివృద్దే ప్రధాన లక్ష్యంగా సబ్‌ప్లాన్‌కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాజీవ్‌ యువకిరణాలు పేరుతో మూడులక్షల మందికి ఉద్యోగాలివ్వాలనే ఉద్దేశ్యంతో రోజుకు వెయ్యిమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్న ఘనమైన చరిత్ర తన ప్రభుత్వానిదేనన్నారు. శిక్షణ తీసుకున్న వారికి 1050కోట్ల రూపాయలను స్వయంఉపాధికోసం ఖర్చుచేస్తున్నామన్నారు. బిసిలపై తమకు కపట ప్రేమ లేదని, మొసలి కన్నీరు కారుస్తుంటారని తమకు ఆలంటిది లేదన్నారు. చంద్రబాబు 1500కోట్లు 9ఏళ్లలో ఖర్చుచేయని టిడిపి బిసి పక్షపాతిగా ఉందా, తాము పక్షపాతులమా అన్నారు. స్వయం ఉపాధికోసం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించనున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు రెండే రెండు భారీ చట్టాలు వచ్చాయని, ఇందులో పేదలకు భూముల పంపిణీ ఒకటికాగా, మరోటి ఎస్సీఎస్టీలకు సబ్‌ప్లాన్‌ పథకం అన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం మహిళా సంఘాలకు 11వేల500 కోట్లురుణాలివ్వాలని బ్యాంకర్లకు టార్గెట్‌ నిర్ణయిస్తే అధికమించి 12వేల 575 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. టార్గెట్‌ను మించి 1500కోట్లు అధనంగా రుణాలిచ్చినందుకు బ్యాంకర్లకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి చెల్లిస్తున్నందునే బ్యాంకర్లు మహిళల ఇళ్లకు వచ్చి రుణాలిస్తున్నారని తెలిపారు. బ్యాంకర్ల విశ్వాసం చూరగొన్న మహిళలను చూస్తే తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో2013-14లో 14వేల 976 కోట్లు బ్యాంకులనుంచి, మరో 1600కోట్లను స్త్రీనిధి బ్యాంకులనుంచి రుణాలు ఇస్తామన్నారు. మహిళా విఓలకు రాష్ట్రంలోని 5వేల గ్రామాల్లో స్వంత భవనాలను నిర్మిస్తామన్నారు. ప్రతిజిల్లాలో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జిల్లాల్లో 30 ఎకరాల భూమిని కేటాయిస్తుందన్నారు. రాష్ట్ర మహిళలు ఇప్పటికి సాధించిన దాంతో సంతృప్తి చెందకుండా ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈమహిళా పారిశ్రామిక వాడలను మంజూరు చేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు తొమ్మిదింటిని కలుపుకుని తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. ఏకార్యక్రమంలోనైనా ఇబ్బందులుంటాయని, టిడిపి, వైసిపి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పేదవారికి మేలు చేయాలనే తపన కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. టిడిపి మొండి హస్తం అంటూ చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో బకాయిలుగాఉన్న 268 కోట్లరూపాయల విద్యుత్‌ బకాయిలను సబ్‌ప్లాన్‌ బడ్జెట్‌లోంచి చెల్లిస్తున్నామన్నారు. రాబోయేకాలంలో కూడా ప్రతిఒక్కరు విూటర్‌ను బిగించుకుంటే యాబైయూ నిట్లవరకు బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తాము తగ్గించిన బిల్లులవల్ల కోటి86లక్షల గృహాలకు లబ్దిచేకూరబోతోందన్నారు. రెండు కోట్లగృహాల్లో ఇంత మందికి లబ్దిచేకూరుతున్నా వారికి పట్టడం లేదని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చెరువులు అభివృద్దికోసం 300 నుంచి 400కోట్లు కేటాయిస్తామన్నారు. మంచినీటి కోసం తక్షణంగా ఐదుకోట్లను సిఎం మంజూరుచేశారు.కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, డికె అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ జగ్గారెడ్డి అధ్యక్షత వహించారు..