తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 891 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆత్మ గౌరవం, స్వయం పాలన కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు. రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.