తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టవా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశాబ్దాలుగా తమ నాణ్యమైన హక్కును సాధించుకోవడానికి ఈ ప్రాంత ప్రజలు చేయని ఉద్యమాలు లేవు. ఎక్కని గడప లేదు. కలవని పార్టీలేదు. సంప్రదింపులు, చర్చోపచర్చలు, అప్పుడప్పుడు డెడ్‌లైన్లు అయినా ఆకాంక్ష నెరవేరలేదు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్రం హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి మనం సాధించాం అని పడుకున్న వారందరినీ నిద్రలేపారు. కానీ ఆ సంబరం ఎన్నో గంటలు నిలువలేదు. సీమాంధ్ర పార్టీల్లోని పెట్టుబడిదారులంతా కలిసి పోటీ ఉద్యమానికి తెరలేపారు. దీంతో వచ్చిన తెలంగాణ వెనక్కు వెళ్లి ప్రజలు వంఛనకు గురయ్యారు. అప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏకతాటిపైకి వచ్చిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తర్వాత సొంతరాగం ఆలపించడం మొదలు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మంత్రులైతే అప్పుడే తాము ఈ ప్రాంతంలో భాగం కాదన్నట్టే మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కొత్త పల్లవి అందుకున్నారు. వారికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు పెట్టుబడీదారులు వంతపాడారు. అసలు హైదరాబాద్ నగరంలో పుట్టిపెరిగిన ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి పట్టదు. హైదరాబాద్ అంటే కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జుబ్లీ, బంజారాహిల్స్ మాత్రమే కావనే విషయాన్ని విజ్ఞులైన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం నిజంగా దారుణం. ఇక మెదక్ జిల్లా కేంద్రం సంఘారెడ్డి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం అసలు తెలంగాణే అవసరం లేదంటూ నానా యాగీ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కేసీఆర్ హీరో అవుతాడు కాబట్టి అధిష్టానం స్పందించవద్దన్నాడు. ఈమేరకు ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి కోరుతానన్నాడు. ఎవరి కోసమో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం నిజంగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే. ఇలాంటి వారిని ఏం చేయాలి.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టదా? అక్కడివారికి తెలంగాణ అవసరం లేదని చెప్పేందుకు జగ్గారెడ్డి ఎవరు. ఎమ్మెల్యే అయినంత మాత్రానా, విప్ పదివిని విసిరనంత మాత్రమే కన్నతల్లికే ద్రోహం చేస్తారా? ఇలాంటి వారే ఈ ప్రాంతంలో ఎందరో ఉన్నారు. ఒక్క అధికారపార్టీలోనే కాదు, ప్రతిపక్ష టీడీపీలో, ఇప్పుడిప్పుడే ఇక్కడ నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు. వారందరికీ ప్రజల ఓట్లు కావాలి, కాని వారి ఆకాంక్ష పట్టదు. ఆత్మగౌరవం పట్టదు. తాము సీమాంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగుతున్నట్లే ప్రజలు కూడా సారా ప్యాకెట్లకో, పచ్చనోట్లకో ఓట్లు వేయాలనేది వారి అభిమతం.
అందుకోసం ఎన్నికలకు ముందు కొద్దిపాటి తాయిలాలు ప్రకటిస్తే చాలనుకుంటున్నారు. తెలంగాణ మార్చ్ తర్వాత యావత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పథాన పయనిస్తున్నా వారికి పదవులే కావాలి. అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యమంలో న్యాయబద్ధంగా పాలుపంచుకుంటున్న వారిని బజారుకీడ్చాలి. ఇలాగే కొందరు అత్యుత్సాహంతో టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలకు కోదండరామ్‌తో ఉన్న పంచాయితీ ఏమిటీ? వారితో ఆయనకు భూముల లావాదేవీలు, నోట్ల పంపకాలు లేవనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయినా ఆయనపై బురద జల్లడమే వారి పని. కోదండరామ్‌కు ఆయా నేతలతో ఉన్న పంచాయితీ ఒక్కటే అది తెలంగాణ మాత్రమే. అది ఇక్కడి నేతలంతా తెలుసుకుని ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలనేది తెలంగాణ ప్రజల కోరిక.