తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఫుడ్ కాంట్రాక్టులను వెంటనే రద్దు చెయ్యాలి

-టి ఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్.
గద్వాల నడిగడ్డ, జులై 26 (జనం సాక్షి);
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురై హాస్పిటల్లో చికిత్స పొందిన సంఘటనలు రోజురోజుకు పెరుగుతుండడంతో గురుకుల పాఠశాల ఫుడ్ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని మంగళవారం టీఎన్జీవో భవనంలో విలేకరుల సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాన్ అన్నారు.తెరాస నాయకులకు సంబందించిన వారికి ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఫుడ్ కాంట్రాక్టులను అప్పగించడంతో వారు కమీషన్లకు కకృత్తి పడి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో, కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురైన సంఘటనలు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గట్టు మండలం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 60 మంది విద్యార్థులు అవస్థతకు గురైతే ఇప్పటివరకు కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇటీవల కాలంలో ఐజ మండలం బింగుదొడ్డి గ్రామంలో మధ్యాహ్న భోజనం మెనూ పాటించకుండా చిన్నారులకు గొడ్డుకారంతో భోజనం పెడితే ఇప్పటివరకు చర్యలేవి అని ప్రశ్నించారు.అధికారులు గురుకుల పాఠశాలలో ప్రభుత్వ విద్యాసంస్థలలో పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.అలాంటి వారిని కాంట్రాక్టులను రద్దు చెయ్యకుండా ఏడాది కాలం మొత్తం కొనసాగించడం విద్యార్థులకు ప్రమాదకరమని,భవిష్యత్తులో అన్ని గురుకుల పాఠశాలల ఫుడ్ కాంట్రాక్టులల్లో జరిగిన అవకతవకలను ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని, వెంటనే సంబంధిత కాంట్రాక్టులను రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంజిపేట రాకేష్, మహేష్,వెంకటేష్, తిరుమలేష్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.