తెలంగాణ బిల్లు పెట్టండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి

ఓయూ జేఏసీ భారీ ర్యాలీ శ్రీసచివాలయం ముట్టడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి):
బీసీ, ఇబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేయాల్సిం దేనని ఓయు జెఎసి విద్యార్థులు నినాదాలు చేశారు. సచివాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్‌ పిఎస్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఫీజు రియంబర్స్‌మెంటుపై కిరణ్‌ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓయు జెఎసి విద్యార్థులు బుధవారంనాడు సచివాల యాన్ని ముట్టడించేందుకు భారీగా కదలివచ్చారు. సచివాలయానికి చేరుకోకముందే వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థుల కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఒక పాఠశాల బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతోపోలీసులు వారిని అరెస్టు చేసి కొందర్ని సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్‌మెంట్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. బీసీ, ఇబిసిలకు ఫీజు రియంబర్స్‌మెంటు పథకాన్ని అమలు చేయాల్సిందేనన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఇప్పటికే విద్య భారంగా మారిందని, ఫీజులు చెల్లించాలంటే పేదలు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఓయు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎబివిపి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ డిమాండు చేశారు. ఉస్మానియాలో పోలీసులు భారీగా మొహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.