తెలంగాణ మంత్రులు బానిసలు

తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వం తెగ్గోసినా ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు బానిసల్లాగానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణపై ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌, మూడు ప్రాంతాల ముఖ్య నేతలను పిలిచి మాట్లాడుతామని తెలిపాడు. తెలంగాణ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదని, ఎప్పట్లోగా సమస్య పరిష్కారమవుతుందో హోం మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందని’ తెలిపాడు. ఆజాద్‌ ఈ రోజు చేసిన ప్రకటనకు గులాములా రాష్ట్ర మంత్రి జానారెడ్డి స్పందించారు. తెలంగాణవాదాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న జానా అధిష్టానం వీరవిధేయత ప్రకటించాడు. ఆజాద్‌, షిండే ప్రకటనల్లో చిత్తశుద్ధి కన్పిస్తోందంటూ వక్రభాష్యం చెప్పాడు. సీమాంధ్ర మోచేతి నీళ్లు తాగుతూ, వారిచ్చిన మంత్రి పదవులు వెలగబెడుతున్న వారందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. వారందరి తరుఫున మీడియా ముందుకు వచ్చిన జానా కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుందని సన్నాయి నొక్కులు నొక్కాడు. జఠిలమైన సమస్య పరిష్కార దిశలో ఉన్న సమయంలో సంయమనం పాటించాలని తెలంగాణ ప్రజలకు ఓ ఉచిత సలహా పారేశాడు. ఆ’జాదూ’ తీరుపై తెలంగాణ ప్రజలంతా మండిపడుతుంటే మంత్రులు మాత్రం అధిష్టానం అడుగులకు మడుగులొత్తుతున్నారు. అధిష్టానం, సీమాంధ్ర పాలకులు విదిల్చిన మంత్రి పదవి కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేలా మట్లాడారు. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిగతా మంత్రులకు సంబంధం లేకుంటే ఆ వెంటనే ఖండించేవారు. ప్రజాగ్రహం చవిచూసిన తర్వాత కూడా ఎవరూ కనీసం స్పందించలేదు. అంటే వారికి అమాత్య హోదాపై ప్రేమే తప్ప ప్రజల ఆకాంక్షపై గౌరవం లేదు. సీమాంధ్రులకు అత్యంత ఆప్తుడిగా, తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన ఆజాద్‌ వ్యాఖ్యలను ఎవరూ ఖండించే సాహసం చేయలేదంటే మంత్రుల బానిసత్వ వైఖరికి ఇంకా ఏం నిదర్శనాలు కావాలి. బలితీసుకునేవాడినే గొర్రె నమ్ముతుంది. బలిపీఠం ఎక్కించి బలిచ్చే ముందు కూడా అతడు తనకు ఏదో మంచి చేయబోతున్నాడని అనుకుంటుంది. తెలంగాణ ప్రజలను బలిపీఠం ఎక్కించిన కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని రాష్ట్ర మంత్రులు అలాగే నమ్ముతున్నారు. మంత్రులు తీరును కాళోజీ మాటల్లో చెప్పాలంటే పెద్దపాలేరుకు కొత్త గొంగడి కప్పినంత సంతోషంగా వ్యవహరిస్తున్నారు. తమను ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపిన ప్రజల ఆకాంక్షలు, స్వపరిపాలన కాంక్షను అవమానించి కేంద్రం ఇంకా తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ప్రకటించిన మంత్రులే ఇక మన టార్గెట్‌. వారు అమాత్య హోదాలను అనుభవిస్తూ బుగ్గకార్లలో తిరుగుతూ సీమాంధ్ర నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దు. వారికి తగిన గుణపాఠం చెప్పి జై తెలంగాణ అనిపించాలి. ఇంకా వారు పదవులపై ప్రేమను ప్రదర్శిస్తూ ఇలాగే మాట్లాడితే తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. కాంగ్రెస్‌ మంత్రులే లక్ష్యంగా ప్రజలు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇకనైనా మంత్రులు తీరుమార్చుకోకుంటే తెలంగాణ ప్రజలు వారి రాజకీయ భవితవ్యానికి కొత్త భాష్యం చెప్పడం ఖాయం. ఇందుకు ఇంకా సమయమున్నా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సమర దీక్ష ముగింపు సందర్భంగా ప్రకటించబోయే ఉద్యమ కార్యాచరణలో వారే టార్గెట్‌ కావడం ఖాయం.