తెలంగాణ ముసుగులో మతతత్వం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని ఎంతగా అణచాలని చూసినా ఏమాత్రం బెదరకుండా ముందుకుసాగారు. పది జిల్లాల ప్రజలు ఆత్మగౌరవం, స్వయం పాలన, వనరులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల రక్షణ కోసం పోరాట పథాన సాగుతుంటే ఈ ఉద్యమంలో ఎన్నో సంఘాలు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ద్వారా గెలుపొందే ప్రతినిధులు చట్టసభల్లో సమస్యపై చర్చించే అవకాశం ఉంటుందంటే వారిని అఖండ మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ సాధన కోసమంటూ ఇప్పుడు పోరాడుతున్న టీఆర్‌ఎస్ మొదటి ఉద్యమ పార్టీ కాదు. 1969లోనే తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఆవిర్భవించిన పార్టీని 1971 ఎన్నికల్లో ఆదరించారు. పది మంది ఎంపీలను ఆ పార్టీ తరఫున గెలిపించి లోక్‌సభకు పంపారు. కొన్నాళ్ల తర్వాత టీపీఎస్ కాంగ్రెస్‌లో విలీనమవగా, తెలంగాణ కోసం మరికొన్ని రాజకీయ పక్షాలు ఆవిర్భవించి వివిధ పార్టీల్లో కలిసి పోయాయి. తెలంగాణ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధిపొందాలని భారతీయ జనతాపార్టీ సంకల్పించింది. అందుకే ఆ పార్టీ కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో తీర్మానం చేసింది. ఇలా తీర్మానం చేసిన తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు ఎంపీలు గెలుపొందారు. తెలంగాణ పేరుతో ఓట్లు దండుకున్న బీజేపీ ప్రజల ఆకాంక్షలను మాత్రం విస్మరించింది. భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారం పొందిన బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఏన్‌డీఏ ముందే ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీ తుంగలో తొక్కింది. రాష్ట్రం ఏర్పాటు చేయకపోగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జింఖాన మైదానంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలను గాయపరిచారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన ప్రాంతాలు ఆయా రాష్ట్రాల రాజధానులకు బహుదూరంలో ఉన్నాయని, తెలంగాణ పరిస్థితి అలా లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాదే తెలంగాణ ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేక రాష్ట్ర అవసరం ఏముందని ప్రశ్నించారు.
మరి కాకినాడలో పార్టీ తీర్మానం చేసేప్పుడు ఈ విషయం అద్వానీకి తెలియదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రతి సభలో చెప్పినప్పుడు హైదరాబాద్ విషయాన్ని విస్మరించారా? అంటే అప్పట్లో సమాధానం లేదు. 2009లో తెలంగాణ ఉద్యమం హోరున సాగుతుండగా బీజేపీ మళ్లీ తెలం‘గానం’ అందుకుంది. తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా చేస్తున్నది న్యాయమైన పోరాటమని, వారి పోరాటానికి ఫలితం దక్కాలంటూ కొత్త పలుకులు పలికింది. టీ కాంగ్రెస్ ఎంపీలు, టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ కేంద్రంగా సాగించిన పోరాటంలో గొంతు కలిపింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో 17 ఎంపీ సీట్లున్నాయి. తెలంగాణ ఇస్తామంటే వాటిలో ఎక్కువ స్థానాలు సాధించవచ్చని బీజేపీ మళ్లీ తెలంగాణ పల్లవి ఎత్తుకుంది. అధికారంలో ఉన్నప్పుడు దేన్నైతే విస్మరించారో ఇప్పుడు అదే ఇస్తామని ఎందుకు చెప్తున్నారంటూ ప్రశ్నిస్తే అప్పుడు ఎన్‌డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతోనే తాము ఏమీ చేయలేకపోయామని చెప్తుంది. అప్పుడు టీడీపీ ఎంపీల బలంతో అధికారం దక్కించుకున్న బీజేపీకి ఇప్పుడు మరో సీమాంధ్ర పార్టీ మద్దతిస్తే తెలంగాణ అంశం ఏమవుతుంది? గతంలో ఒకసారి మోసం చేసిన పార్టీ ఇప్పుడు మళ్లీ మోసం చేయలేదా? తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గాలు. ఆ వర్గాలు ఎంతస్థాయిలో లాబీయింగ్ చేసేందుకైనా సిద్ధపడుతాయి. అలాంటి శక్తులు మరో రాజకీయ పార్టీని పురిగొల్పి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమే. ఆత్మగౌరవం, స్వపరిపాలన అత్యంత ఆవశ్యకమే. కానీ ఆ ముసుగులో మతతత్వ రాజకీయ శక్తులు బలపడటం తెలంగాణ ప్రజలకు ప్రమాదకరమే. ఇప్పుడు రెండు మతతత్వ పార్టీలు తెలంగాణకు అనుకూల, వ్యతిరేఖ వైఖరులతో ముందుకు వస్తున్నాయి. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. కలిసి మెలిసి జీవనం సాగించాలి. ప్రగతిశీల శక్తుల నేతృత్వంలో సాగుతున్న ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలి. గంగాజమున తహజీబ్ హైదరాబాద్ ప్రజల జీవన విధానం. దీనికి విఘాతం కలిగించాలని చూసే శక్తులు బలోపేతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. ఇప్పుడు ప్రజలు ఆ కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాలి.