తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ
ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు
రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం మేడ్చల్‌ మాజీ సర్పంచ్‌ రాజేశ్వర్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సీమాంధ్ర పార్టీల నేతలు ఇచ్చే హామీలు చూసి ఎవరూ మోసపోవద్దని కోరారు. సీమాంధ్ర నేతలు రాజగోపాల్‌, కావూరి హైదరాబాద్‌ వారి అబ్బసొత్తు అయినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల అబ్బసొత్తుమాత్రమనేని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువుల పింఛన్‌ రూ. వెయ్యికి, వికలాంగుల పింఛన్‌ రూ. 1500లకు పెంచుతామనిహామీ ఇచ్చారు. రూ. 2 లక్షల పూర్తి సబ్సిడీతో సౌకర్యవంతమైన ఇళ్లు ఉచితంగా నిర్మిస్తామన్నారు. రాజన్న, చంద్రన్న లాంటి తోక రాజ్యాలు మనకు వద్దని తెలంగాణ రాజ్యమే కావాలని స్పష్టం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.