తెలంగాణ వచ్చాకే మన పండుగలకు గుర్తింపు

– మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,జూలై    (జనంసాక్షి ) :
తెలంగాణ వచ్చాకే మన పండుగలకు గుర్తింపు లభించిందని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణం ఎదిరలో బంగారు మైసమ్మ బోనాల పండుగకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అశేషంగా హాజరైన భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొని డోలు వాయించారు. అనంతరం బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ వచ్చిన తర్వాతే బోనాల పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. వెనకబడిన ప్రాంతాలు సైతం బాగుపడ్డాయన్నారు. ఎదిర గ్రామం కాస్త ఇప్పుడు పట్టణంలో భాగంగా మారిందని… సమీపంలో నిర్మాణం అవుతున్న ఐటీ పార్క్ త్వరలోనే పూర్తవుతుందని దీని ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, కౌన్సిలర్ హన్మంతు, నర్సింహులు, ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు.