తెలంగాణ వచ్చే వరకూ పోరు ఆగదు
సత్యాగ్రహం తరహాలో ఉద్యమం : కోదండరాం
మరో మారు సకలం బంద్‌కు సిద్ధం కండి : స్వామిగౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి):
తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం స్పష్టం చేశారు…తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎలాంటి ఉద్యమానికైనా వెనకాడమన్నారు. అవసరమైతే సత్యాగ్రహం చేయడానికైనా సిద్ధమన్నారు..సకులజనుల సమ్మె జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఉదయం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద గల అమరవీరుల స్థూపానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. బీజేపీ సీనియర్‌నేత దత్తాత్రేయ, కాంగ్రెస్ మాజీ ఎంపీ కె. కేశవరావు, తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నాయకులు స్వామిగౌడ్ మాట్లాడుతూ అవసరమైతే మరోసారి సకలజనుల సమ్మె చేయడానికి ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు…అసలు తెలంగాణ ఇస్తారో.. ఇవ్వరో.. చెప్పండి అంటూ బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తారో
ఇవ్వరో తేల్చి చెప్పాలని కోరారు. నాన్చుడు ధోరణి వల్ల ప్రజలు మరింత ఆవేదనకు గురవుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకోకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నదన్నారు. గవర్నర్ నరసింహన్ అందించిన నివేదిక ప్రకారమే కేంద్రం నడుచుకుంటోందన్నారు. ఈ నెల 30నచేపట్టనున్న తెలంగాణ మార్చ్ అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా యత్నిస్తోందన్నారు. అయినప్పటికీ మార్చ్ యథాతథంగా కొనసాగుతుందన్నారు. అనంతరం మాజీ ఎంపీ కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేయాలన్నారు. తెలంగాణ మార్చ్‌కి అన్ని పార్టీల మద్దతు ఇస్తున్నాయన్నారు. ఎవరు ఏ అజెండా పట్టినా వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌ను శాంతి భద్రతల పేరిట అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎవరూ అడ్డుకోలేరన్నారు. తెలంగాణ సాధించుకోవడం కోసం తెలంగాణ మార్చ్ తరువాత సత్యాగ్రహ రీతిలో ఉద్యమం చేపట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఇదిలా ఉండగా సకలజనుల సమ్మె ఏడాది పూర్తయిన సందర్భంగా ఇందిరా పార్కువద్ద తెలంగాణ ఉద్యోగుల సంఘం గురువారం ఉదయం పునరంకిత దీక్ష చేపట్టింది. దీక్షను కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకువెళతామన్నారు. సకల జనుల సమ్మెను మళ్లీ చేపట్టాలని టీఎన్జీఓ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, 70 సంఘాల ప్రతినిధులను కోరుతున్నామన్నారు. తెలంగాణ మార్చ్ తరువాత ఇంటికో మనిషి, చేతికో జెండా కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు.
ఐటము నంబరు 8990