తెలంగాణ శాసనసభను కుదిపేసిన 7 మండలాల విలీన అంశం

హైదరాబాద్‌ : ఏపీలో 7 ముంపు మండలాల విలీన అంశం తెలంగాణ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై తెరాస, కాంగ్రెస్‌, భాజపా సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాల విలీన విషయంపై కాంగ్రెస్‌ ఆరోజు ఎందుకు మాట్లాడలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ మద్దతుతోనే విలీన బిల్లు ఆమోదం పొందలేదా? అని ప్రశ్నించారు. ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలన్న పత్రిపాదన జైరామ్‌రమేశ్‌దేనని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా ముందుంటామని ప్రకటించారు. (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా చింతూరు, కూనవరం, బూర్గంపాడు(కొన్ని గ్రామాలు), వీరులపాడు, కుకునూరు, వరరామచంద్రాపురం, భద్రాచలం(కొన్ని గ్రామాలు) మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే).
ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ వాకౌట్‌
ఈ అంశంపై కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ప్రోద్బలంతోనే 7 మండలాల విలీనం జరిగిందని విమర్శించారు. ముంపు మండలాలు పోతేపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పలేదా? అని అన్నారు. 7 మండలాల విలీనానికి కేసీఆర్‌ అంగీకరించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. ముంపు మండలాలు తిరిగి సాధించుకునేందుకు దిల్లీకి అఖిలపక్షం అన్నారు.. అది ఏమైందని ప్రశ్నించారు. ముంపు మండలాల విలీన అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ముంపు మండలాలపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి : లక్ష్మణ్‌
ఏడు ముంపు మండలాల విలీనంపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శించారు. ముంపు మండలాల విలీన అంశంపై శాసనసభలో లక్ష్మణ్‌ మాట్లాడారు. 7 మండలాల విలీన అంశంపై దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. రాష్గానికి రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కాంగ్రెస్‌ను రెండు రాష్గాల్లో ప్రజలు తిరస్కరించారని.. ఇప్పటికైనా ద్వంద్వ విధానాలు మానుకోవాలని కోరారు.