తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

C

ద్రవ్య వినిమయ బిల్లుపై వాడివేడి చర్చ

బిల్లుకు సభ ఆమోదం

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర బ్జడెట్‌ సమావేశాలు 14 రోజులపాటు జరగ్గా చివరిరోజైన గురువారం సభలో పలు కీలక విషయాలపై చర్చజరిగింది. లెవీ విధానం యథాతథంగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానం చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బిల్లు ఆమోదించాక  రాష్ట్ర అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.అనంతరం సభను నిర్వహించేందుకు సహకరించిన సభ్యులందరికి స్పీకర్‌ మధుసూధనాచారి కృతజ్ఞతలు తెలిపారు. సభను సైనడై చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై వాడీవేడీ చర్చ సాగింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అంతా అవాస్తవంగా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ లెక్కలను ఎత్తిచూపుతూ విపక్షాలు విమర్శలు సంధించాయి. మంత్రులు మధ్యలో జోక్యం చేసుకుంటూ విమర్శలను తిప్పికొట్టారు.  బడ్జెట్లో సవరించిన అంచనాల్లో భారీ కోతలున్నాయని ఉత్తమ్‌ విమర్శించారు. గతేడాది లక్షా ఆరు వేల కోట్ల బడ్జెట్లో 40 శాతం తగ్గిందని ఉత్తమ్‌ గుర్తు చేశారు. ఈ ఏడాది రూ. లక్షా 15 వేల కోట్ల బడ్జెట్లో 30 శాతం తగ్గడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి నిధుల కోత తప్పదన్నారు. అందుకే ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం… అలాంటి రాష్ట్రంలో రెవిన్యూ మిగులు ఉండటానికి సోనియా ముందు చూపే కారణమని ఈ సందర్భంగా వెల్లడించారు. పవర్‌ ప్రాజెక్టులు, యూపిఎ హయాంలో తీసుకున్న  నిర్ణయాలు మేలు చేశాయన్నారు.  తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్‌ ముఖ్యపాత్ర పోషించిందనిఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక శక్తిగా ఎదగడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పునాది వేసిందని, తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి కాంగ్రెస్‌ పార్టీ కారణం కాదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను అన్యాయం తలపెట్టే భూ సేకరణ చట్టాన్ని.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అపహాస్యంగా ఉందని కాంగ్రెస్‌ సభాపక్షనేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం రికార్డుల ఆధారంగా చెప్పినదానికి చూపేదానికి పొంతన లేదన్నారు. కేవలం 40శాతం ఖర్చు లేని విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. మిగతా లెక్కలు సభాపూర్వకంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. పది నెలల కాలంలో నాన్‌ ప్లాన్‌ కు ఎంత పోయింది. ? ప్లాన్‌ కు ఎంత పోయింది ? చెప్పాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు. అయితే  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ లబ్దిదారుల సంఖ్య పెరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  కులాల వారీగా వసతిగృహాలు నిర్మించాలని బిజెపి  ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గత సంవత్సరం బ్జడెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ ఫెడరేషన్స్‌కు నిధులు విడుదల చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం మిగతా పార్టీల ప్రజా ప్రతినిధులపై పక్షపాతం చూపుతోందని, ప్రభుత్వం పక్షపాత ధోరణి వీడాలని బీజేపీ నేత కిషన్‌రెడ్డి సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఉన్న ప్రాంతాలకే అధిక నిధులు ఇస్తుందన్నారు. తెలంగాణ అంటే పది జిల్లాలని, ఇందులో ఈ ఒక్క జిల్లా అభివృద్ధి కాకపోయినా బంగారు తెలంగాణ కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే.. వారు అనుకున్న బంగారు తెలంగాణ సిద్ధించదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నుంచి నిధులు తగ్గాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంచి చేసినవాటిని కూడా ప్రస్తావించి విమర్శిస్తే బాగుంటుందన్నారు.  సమావేశాలు ముగిసేలోపు బడ్జెట్‌ లెక్కలు సమర్పించాలని బీజేఎల్పీ నేత లక్ష్మణ్‌ సభలో విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లోని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఇందులో దాచుకోడానికి ఏవిూ లేదని సమాచారం పూర్తి స్థాయిలో లేనందునే ఆలస్యం అయ్యిందని మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే బడ్జెట్‌ లెక్కలు సమర్పిస్తానని ఈటెల తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్‌ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగిందని తెలిపారు. అన్ని యూనివర్సిటీలకు త్వరగా వీసీలను నియమించాలని కోరారు. సచివాలయం తరలింపుపై అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్‌ ఆస్పత్రిలో హైదరాబాద్‌లోనే ఉంచితే బాగుంటుందని చెప్పారు. అవసరమైతే పాత బస్తీలో చెస్ట్‌ ఆస్పత్రిని నిర్మించండి అని విజ్ఞప్తి చేశారు. ఉపప్రణాళికపై సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌ సభ్యులు నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం శాసనసభ కమిటీలచైర్మన్ల పేర్లు ఖరారు చేసింది. మహిళా, శిశుసంక్షేమం కమిటీకి రేఖానాయక్‌, దళిత సంక్షేమం కమిటీకి బాబూ మోహన్‌, బీసీ సంక్షేమం కమిటీకి గంగాధర్‌గౌడ్‌, గిరిజన సంక్షేమం కమిటీకి రెడ్యానాయక్‌, మైనారిటీ సంక్షేమానికి షకీల్‌ అహ్మద్‌ నియమితులయ్యారు.

పెన్షన్లు 33లక్షలకు పెరిగాయి

అయితే మధ్యలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్‌ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అనవసరంగా దురుద్దేశాలు ఆపాదించొద్దని పేర్కొన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కీలక గ్రావిూణ పథకాలను తొలగించిందని గుర్తు చేశారు. గ్రావిూణ ప్రాంతాల విూద ప్రేమ ఉంటే కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. 70 శాతం నిధులు గ్రామ పంచాయితీలకు నేరుగా వెళ్తున్నాయని తెలిపారు. కేంద్రం కుడి చేత నిధులిచ్చి.. ఎడమ చేత లాక్కుందన్నారు. గతంలో హైదరాబాద్‌లో 87 వేల పింఛన్లు ఇస్తే ఇప్పుడు తాము లక్షకు పైగా పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 29 లక్షల పింఛన్లు ఇస్తే తమ ప్రభుత్వం 33 లక్షల పింఛన్లు ఇస్తుందని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతదని తెలంగాణ రాకముందు పలువురు ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

కళ్యాణలక్ష్మి పేదలకు వరం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పేదింటి ఆడబిడ్డలకు వరం అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. శాసనసభలో సునీత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు సైతం స్వాగతించాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ గ్రామానికి పింఛన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. హాస్టల్‌ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. రూ. 6500 కోట్ల అదనపు భారం పడ్డా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. ఎన్నికల్లో హావిూ ఇచ్చిన మేరకు రైతులకు రుణమాఫీ చేశామని ఉద్ఘాటించారు.