తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది

రేణుకా చౌకబారు రాజకీయాలు మానుకో

కోదండరామ్‌ గుస్సా
నాలుక కోసేస్తాం : అమరవీరుల కుటుంబాలు
హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
రేణుకా చౌదరి ఇకనైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ అమరవీరుల పట్ల రేణుకా చౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరో మారు ఆ పార్టీ నాయకులు రుజువు చేసుకున్నారన్నారు. ఇప్పటి వరకు వాయిలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, షిండే తెలంగాణపై  వారి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడారని విమర్శించారు. ఇడ్లీ, దోశ అని ఒకరు, లెక్కలే మార్చేసేది మరోకరు, ఇచ్చిన మాటనే మర్చిపోయేది మరోకరు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తెలంగాణ వాదులను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. తాజాగా రేణుకా చౌదరి కూడా ఆ జాబితాలో చేరారు. తాను కూడా తెలంగాణ బిడ్డనేననంటూ చెప్పుకునే రేణుకా అమరవీరులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల మరణంపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి నాలుక కోస్తామని తెలంగాణ అమరవీరుల కుటుంబాలు హెచ్చరించాయి.  నోరు ఉన్నదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. అమర వీరులపై చేసిన మాటలు వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేణుకా చౌదరి ఎక్కడికి పోయినా అక్కడ చెప్పులతో, చీపుర్లతో తగిన శాస్తి చేసి, బుద్ధి చెబుతామన్నారు.
రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి
కరీంనగర్‌ :
తెలంగాణ అమరవీరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని  కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.